Lok Sabha Election 2024: ఆరో విడత పోలింగ్‌.. 58 స్థానాలకు ఎన్నికలు

ఆరో విడతలో శనివారం(మే 25న) ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అన్నిటా బీజేపీ, విపక్ష ఇండియా క ఊటమి మధ్యనే పోటీ నెలకొంది.

Written By: Neelambaram, Updated On : May 25, 2024 10:02 am

Lok Sabha Election 2024

Follow us on

Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడత పోలింగ్‌ శనివారం(మే 25న) జరుగుతుంది. 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దేశ రాజధాని ఢిల్లీ, హరియాణాల్లోని అన్ని నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం ఏడు విడతల్లో 543 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఆరో దశతో 486 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.

58 స్థానాలకు ఎన్నికలు..
ఆరో విడతలో శనివారం(మే 25న) ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అన్నిటా బీజేపీ, విపక్ష ఇండియా క ఊటమి మధ్యనే పోటీ నెలకొంది. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్‌ 4, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక హరియాణాలో కూడా మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోనూ మిగిలిన స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 58 స్థానాలకు 889 మంది పోటీలో ఉన్నారు. ఈ విడతలో ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్‌ జరుగుతుంది.

బరిలో ముఖ్య నేతలు..
ఇక ఆరో విడతలోనూ ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. బీజేపీ నేతలు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(హరియాణాలోని కర్నాల్‌), ధర్మేద్ర ప్రధాన్‌(ఒడిశాలోని సంబల్‌పూర్‌), అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌(పశ్చిమ బెంగాల్‌లోని తామ్లుక్‌), నవీన్‌ జిందాల్‌(కురుక్షేత్ర), రావు ఇందర్‌జిత్‌సింగ్‌(గురుగ్రామ్‌), మేనకాగాంధీ(ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌)తోపాటు పీడీపీ చీఫ్‌ మెహబూబాముఫ్తీ(జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌–రాజౌరీ)నుంచి పోటీ చేస్తున్నారు. నార్‌త ఈస్ట్‌ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్‌ తివారీ, కాంగ్రెస్‌ నేత కన్హయ్యకుమార్‌ పోటీ పడుతున్నారు. జూన్‌ 1వ తేదీన చివరి విడత 57 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది.

ఎవరికి ఎడ్జ్‌?
ఆరో విడత ఎన్నికలు జరుగుతున్న 58 స్థానాల్లో గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఈ సారి ఈ స్థానాల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలు తన ఖాతాలో వేసుకుంటే అధికారానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 57 లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌ గెలవలేదు. మరోవైపు ఆరో విడత ఎన్నికలు ఆప్, తృణమూల్, జేడీ(యూ), బీజేడీ, జేఎంఎం, బీఎస్పీ పార్టీలకు కూడా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఆధిపత్యం కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.