Heat Waves: తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం వారం పది రోజులు చల్లబడింది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గాయి. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే మళ్లీ తెలంగాణలో భానుడు బగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోత్రలు క్రమంగా పెరుగుతున్నాయి. మే 24న(శుక్రవారం) రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
పెరిగిన ఉష్ణోగ్రతలు..
తెలంగాణలోని జగిత్యాల,జిల్లా నేరెల్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9 డిగ్రీలు, హాజీపూర్‌లో 44.5 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి.
మూడు రోజులు జాగ్రత్త..
ఇక రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వాతావణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రం మీదుగా వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా మూడు, నాలుగు డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. 45 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనవసరంగా బయటకు రాబొద్దని పేర్కొంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతాయని వెల్లడించింది.