AP Elections 2024: పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలింది! ఎవరికి మూడిందంటే?

ఉద్యోగ ఉపాధ్యాయులు ఈసారి కసితో ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విషయంలో సవాలక్ష నిబంధనలు విధించినా.. వారు విసుగు చెందలేదు.

Written By: Dharma, Updated On : May 25, 2024 9:36 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలింది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. నాలుగు లక్షల 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు అప్పట్లో తెలిసింది. కానీ రికార్డ్ స్థాయిలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కావడం విశేషం. మొత్తం అన్ని జిల్లాల లెక్క తేలిన తర్వాత.. ఐదు లక్షల 39వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయినట్లు తేలింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో.. ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాలేదు. గత ఎన్నికల్లో రెండు లక్షల 90 వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు రెట్టింపు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో.. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదవుతుంటాయి. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేదని, సీల్ సరిగా వేయలేదని తదితర కారణాలు చూపుతూ చెల్లని ఓట్లుగా చూపుతుంటారు. ఈసారి ఆ నిబంధనను పక్కన పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ కు టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై మౌఖికమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రధాన అధికారి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగ ఉపాధ్యాయులు ఈసారి కసితో ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విషయంలో సవాలక్ష నిబంధనలు విధించినా.. వారు విసుగు చెందలేదు. పనిచేసిన చోట అని ఒకసారి.. స్వస్థలాల్లో ఓటు వేయాలని మరోసారి.. వారిని అయోమయానికి గురిచేసినా ఓపికగా ఓటు వేశారు. గత ఐదు సంవత్సరాలుగా రెండు వర్గాలు ప్రభుత్వ బాధిత వర్గాలే. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఏకంగా ఐదు లక్షల 50 వేల వరకు ఓట్లు పోలయ్యాయి అంటే.. అధికార పక్షానికి గట్టి హెచ్చరికే. అయితే ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరుణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో.. చెల్లని వంటూ పక్కకు తీసే అవకాశం ఉంది. అందుకే టిడిపి నేతలు ముందు జాగ్రత్తగా ఈసీని కలిశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కొన్ని నిబంధనలను సడలించాలని కోరారు. కేంద్రం నుంచి ఆదేశాలు రానిదే.. టిడిపి నేతలు ఈసీని కలవరని.. కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో మార్గదర్శకాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికైతే పెరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.