JanaSena: ఇటీవల జనసేనలోకి వలసలు గణనీయంగా పెరుగుతున్నాయి. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలో చేరారు. ఉభయగోదావరి తో పాటు కీలక జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వారంతా జనసేన వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. అయితే వీరందరికీ టిక్కెట్ హామీ ఉందా? అందుకే చేరుతున్నారా? అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమి తప్పదని భావిస్తున్న వారు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తనను విమర్శించే వైసీపీ నాయకులకు పవన్ చాలా సందర్భాల్లో కౌంటర్ ఇచ్చారు. రేపు టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని కాపాడేది నేనే అంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో వైసీపీ నేతలకు ఆప్షన్ ఇచ్చినట్టు అయింది. అయితే చాలామంది వైసిపి నాయకులు స్వచ్ఛందంగా జనసేన నేతలకు టచ్లోకి వస్తున్నారు. పార్టీలోకి వస్తామని చెబుతున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని వదులుకొని పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ సైతం స్వచ్ఛందంగా వచ్చారు. అయితే ఇలా వస్తున్న కీలక నేతలకు ఎక్కడో చోట సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అది ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఒత్తులు భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలోకి తాజా చేరికలు చూస్తుంటే ఆ సీట్లతో కొత్త నేతలకు ఎలా సర్దుబాటు చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అది కేవలం ప్రచారమేనని తేలుతోంది. మారిన తాజా రాజకీయ పరిణామాలతో జనసేనకు50 నుంచి 60 అసెంబ్లీ స్థానాలను ఇచ్చే అవకాశం ఉందని కొత్త ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే నేతలు టిడిపిలో చేరకుండా.. అనూహ్యంగా జనసేన గూటికి చేరుతుండడం విశేషం. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు.. పదవుల్లో ఉండగానే జనసేనలో చేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరందరికీ టిక్కెట్ హామీ ఉందని టాక్ నడుస్తోంది. అయితే ఇలా చేరిన నేతల సంఖ్య భారీగా ఉండడంతో.. జనసేనకు లభించే టిక్కెట్ల సంఖ్యలో మార్పులు వచ్చాయని తెలుస్తోంది. చంద్రబాబు చేతిలో ఇప్పటికే జాబితా పెట్టారని.. దానిని అనుసరించి వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఒక ప్రచారం అయితే ఉంది. అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.