Homeజాతీయ వార్తలుAssembly Election 2023: 5 రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది? ఆశగా చూస్తోన్న యావత్ భారతదేశం.. కారణమేంటంటే?

Assembly Election 2023: 5 రాష్ట్రాల్లో గెలుపు ఎవరిది? ఆశగా చూస్తోన్న యావత్ భారతదేశం.. కారణమేంటంటే?

Assembly Election 2023: కర్ణాటక ఎన్నికల ముందు… ఎన్నికల తరువాత.. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో గ్రాఫ్ పెంచుతుందో అందరికీ తెలిసిందే. పుష్కర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతూనే ఉంది. దాదాపు కింద పడిపోయి కోలుకోలేని తరుణంలో కర్ణాటక రూపంలో ఒక్క ఆశ చిగురించింది. ఆ గెలుపుతో దేశంలో మరోసారి విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. బలమైన భారతీయ జనతా పార్టీని ఎదురెళ్లి పోరాడుతోంది. అయితే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు వస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. బిజెపి గ్రాఫ్ గణనీయంగా తగ్గుముఖం పడుతుంది.

కర్ణాటక ఎన్నికల వరకు బిజెపి బలం కొండంతగా కనిపించేది. కానీ కర్ణాటకలో ఓటమి తరువాత బిజెపి కూడా ఒక సాధారణ పార్టీయేనని.. ఆ పార్టీకి ఓటమి అన్నది ఒకటి ఉంటుందని గుర్తు చేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బిజెపికి సానుకూల ఫలితాలు రాకపోయినా.. బిజెపి కంటే కాంగ్రెస్ ముందంజలో ఉన్నా.. బిజెపికి ప్రమాద ఘంటికలు మోగినట్టే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధిస్తే ఎలా ఉంటుందన్న చర్చ గత కొంతకాలం జరుగుతోంది. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు పదేళ్ల పాటు జనాలు ఛాన్స్ ఇచ్చారు. సహజంగానే ఆ పార్టీపై వ్యతిరేకత ఉంటుంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించలేదు. ఈ ఐదు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తే మాత్రం బిజెపికి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారుతుంది. బిజెపిని దాటి ఢిల్లీ పీఠాన్ని తాకే ఛాన్స్ దక్కించుకుంటుంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్లలో బిజెపితో.. తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి అప్రకటిత కూటమితో కాంగ్రెస్ హోరా హోరీగా తలపడుతోంది. మెరుగైన ఫలితాలు తెచ్చుకుంటే మాత్రం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాటలోకి వెళ్లినట్లే. కనీసం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉంది. బిజెపి గెలిస్తే మాత్రం ఆ పార్టీ ప్రతిష్ట అమాంతం పెరుగుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయి.

ఇప్పటికే ఎన్డిఏ కి వ్యతిరేకంగా విపక్షాలు కూటమికట్టాయి. ఇండియా కూటమిగా ఏర్పడి పోరాడుతున్నాయి. దీనికి సారధ్యం విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో అభిప్రాయంతో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో మిగతా రాజకీయ పక్షాలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందితే మాత్రం దేశ స్థాయిలో ఆ పార్టీ పరపతి పెరుగుతుంది. ఇండియా కూటమికి కాంగ్రెస్ తప్ప మరో నాయకత్వం కుదిరే పని కానట్టుగా తేలుతుంది. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తోంది. డిసెంబర్ 3నదేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version