HIV Aids: ఆ రాష్ట్రంలో 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌.. 47 మంది మృతి.. అసలేం జరిగింది?

త్రిపుర రాష్ట్రంలో హెచ్‌ఐవీ వేగంగా వ్యాప్తి చెందుతోందని స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ అధికారి వెల్లడించారు. రోజుకు 5 నుంచి 7 కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 828 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 572 మంది ప్రాణాలతో ఉన్నట్లు పేర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : July 8, 2024 8:53 am

HIV Aids

Follow us on

HIV Aids:  హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌.. ఇప్పటి వరకు మందలు లేని వ్యాధి ఇది. ఇది సోకితే లైఫ్‌ స్పాన్‌ పెంచుకోవడం మినహా నయం చేయలేం. దీనిపై చాలా మందికి అవగాహన పెరిగింది. హెచ్‌ఐవీ సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, హెచ్‌ఐవీ బాధితుడి రక్తం మరొకరికి ఎక్కించడం, సురక్షితం కాని ఇంజెక్షన్లు వాడడం వలన వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. విద్యావంతులకు చాలా వరకు దీనిపై అవగాహన ఉంది. అయితే త్రిపుర రాష్ట్రంలో మాత్రం విద్యార్థులే ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. రోజుకు సగటున ఏడుగురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ వస్తుంది. ఇప్పటి వరకు 828 మంది వైరస్‌ బారిన పడగా అందులో 47 మంది చనిపోయవడం కలవరపెడుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 5,674 హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ధ్రువీకరించిన అధికారులు..
త్రిపుర రాష్ట్రంలో హెచ్‌ఐవీ వేగంగా వ్యాప్తి చెందుతోందని స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ అధికారి వెల్లడించారు. రోజుకు 5 నుంచి 7 కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 828 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 572 మంది ప్రాణాలతో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆరోగ్య కేంద్రాల నుంచి సమాచారం సేకరించి ఈ లెక్కలు విడుదల చేసినట్లు త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్‌) వెల్లడించింది.

పురుషులే ఎక్కువ…
ఇక రాష్ట్రంలో నిత్యం 5 నుంచి ఏడుగురు వైరస్‌ బారిన పడుతున్నట్లు టీఎస్‌ఏసీఎస్‌ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,674 మంది బాధితులు ఉన్నారని తెలిపింది. ఇందులో పురుషులు 4,570 మంది ఉండగా, మహిళలు 1,103 మంది, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నట్లు వివరించింది.

ఇంజెక్షన్లతో వైరస్‌ వ్యాప్తి..
ఇక త్రిపురలో హెచ్‌ఐవీ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణాలను త్రిపుర స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ వినియోగించే విద్యార్థులే వైరస్‌ బారిన పడుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 220 స్కూళ్లు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ తీసుకుంటున్నారని తెలిపింది. ఒకరు వాడిన ఇంజెక్షన్‌ను మరొకరు వాడుతున్నారని, తద్వారా హెచ్‌ఐవీ వైరస్‌ ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరంలోకి వ్యాపిస్తుందని వెల్లడించింది. ఇక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం బయటి రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లినట్లు వెల్లడించింది.