Supreme Court key verdict: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ని విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. రిజర్వేషన్లు, ఇతర వ్యవహారాలను కూడా బహిర్గతం చేసింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించడానికి వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. మరి కొంతమంది హైకోర్టు దాకా వెళ్లారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఈనెల 8న తీర్పును వెల్లడించనుంది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉంది.
బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ల కేసు హైకోర్టులో ఉండగానే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సోమవారం ఉదయం ఈ కేసును విచారణకు తీసుకుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో విచారణలో ఉండగానే ఇక్కడ దాకా ఎందుకు వచ్చారని పిటిషనర్ గోపాల్ రెడ్డిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టులో స్టే ఇవ్వకపోవడం వల్లే తాము ఇక్కడికి వచ్చామని గోపాల్ రెడ్డి చెప్పారు. దీంతో స్పందించిన ధర్మాసనం… హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు కేసును విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు గోపాల్ రెడ్డికి స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ఎల్లుండి జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగ్వి, ధవే తమ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు వారు సుప్రీంకోర్టులోనే ఉన్నారు.
మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు, బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఈ కేసులో తమ వాదనలు వినిపించాలని పిటిషన్లు దాఖలు చేశారు. అన్నిటినీ కూడా హైకోర్టు ఎల్లుండి విచారిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వం జీవో విడుదల చేసి బీసీలను మోసం చేస్తోందని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలు జరగవని.. ప్రభుత్వం బీసీలతో ఆటలాడుకుంటుందని ఇప్పటికే బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. అనవసరంగా స్థానిక సంస్థల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఆశావాహులు ఖర్చు పెట్టొద్దని ఆయన సూచించారు.
బీసీలకు జీవో నెంబర్ 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. రెడ్డి సంఘం నాయకులు హైకోర్టు దాకా వెళ్లారు. గవర్నర్, రాష్ట్రపతి ద్వారా ఆమోదం చెందాల్సిన బిల్లులను పక్కనపెట్టి.. రాజకీయ లాభం కోసం రేవంత్ రెడ్డి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అదే విషయాలను తాము దాఖలు చేసిన పిటిషన్ లో ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఒకవేళ హైకోర్టులో గనుక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వస్తే.. గోపాల్ రెడ్డి వంటి నాయకులు సుప్రీంకోర్టు దాకా వెళ్తారని తెలుస్తోంది. అదే విషయాన్ని గోపాల్ రెడ్డి తన అంతరంగీకులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.