House : సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చిన వారందరిని చూస్తుంటే సంతోషంగా ఉందని.. ఒకే దగ్గర కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తోందని తెలిపారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. భూలోకంలో ఏ ప్రాంతానికైనా గుర్తింపు తల్లితోనే ప్రారంభమవుతుందని.. మన సంప్రదాయాలకు, సంస్కృతికి తల్లి ఒక ప్రతిరూపం అంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు ఏకంగా అవమానించారని తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభాలను మాత్రమే చూసుకున్నారని అందుకే ప్రజల ఆకాంక్షలు వెనుకబడ్డాయని తెలిపారు. ఇక తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు తెలిపారు. మన రాష్ట్రం ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం కోసం సాధించలేదని అన్నారు. ఉద్యమం విజయవంతం కావడంలో కవులు, కళాకారుల పాత్ర చాలా ఉందన్నారు. వారు తమ ఆటపాటలతో ఉద్యమానికి ప్రేరణనిచ్చారని ప్రజలలో జ్వాల వెలిగించారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎక్కా యాదగిరిని అభినందించిన సీఎం ఆయనకు ఫోర్త్ సిటీలో 300 గజాల స్థలంతో పాటు రూ.కోటి నగదు అందజేస్తామని తెలిపారు. అయితే ఈయన తెలంగాణ అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్థూపాన్ని రూపొందించిన గొప్ప శిల్పి. ఇక ప్రముఖ కవులు గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం తొమ్మిది మంది కవులు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపిన కవులను గుర్తు చేసుకున్నారు. వారి సేవలకు గౌరవ సూచకంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ మంత్రిమండలంతో చర్చించి ఈ నిర్ణయాలను తీసుకున్నామని ప్రకటించారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన గీతం “జయ జయహే తెలంగాణ” అని తెలిపారు. ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు మా ప్రభుత్వంలో ఈ జయ జయహే గీతాన్ని అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించి గౌరవించామని ఆనందం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో టీజీ స్థానంలో టీఎస్ వాడాలని నిర్ణయించారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని తిరిగి వాహనాలకు అధికారికంగా అమలు చేశామని తెలిపారు.. తెలంగాణ తల్లికి ఇప్పటివరకు అధికారిక రూపం ఇవ్వలేదు. ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లిగా తెలంగాణ తల్లి రూపాన్ని గుర్తించిందని.. అంతేకాదు అధికారికంగా ప్రకటించిందని కూడా తెలిపారు సీఎం. ఈ రూపం ప్రతి ఒక్కరికీ కన్నతల్లి ప్రతిరూపంలా స్పురిస్తోందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.