Nagababu: ఏపీలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రివర్గంలో ఇప్పటివరకు 24 మంది ఉన్నారు. సీఎంగా చంద్రబాబు ఉండగా.. ఆయన కుమారుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండగా.. రాష్ట్ర మంత్రిగా ఆయన బాబాయ్ అచ్చెనాయుడు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉండగా.. ఇప్పుడు ఆయన సోదరుడు నాగబాబు మంత్రివర్గంలోకి వస్తున్నారు. అయితే ఇది వైసీపీకి ప్రచార అస్త్రంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతంలో సీఎంగా జగన్ ఉండగా.. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ పదవులు తీసుకోలేదు. అయితే సమీప బంధువులు మాత్రం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ చాలా యాక్టివ్ గా ఉండేవారు. విధానపరమైన నిర్ణయాలన్నీ వారివే. తెర వెనుక వారే చక్రం తిప్పేవారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు ఆలోచన కూడా వేరేలా ఉంటుంది. కీలక పదవులు కుటుంబ సభ్యులకు అప్పగిస్తే మరో అధికార కేంద్రంగా మారుతారని చంద్రబాబు భావించిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడంతో భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నాగబాబుకు రాజ్యసభ పదవి సర్దుబాటు చేయలేకపోవడంతో.. ఏకంగా మంత్రి వర్గంలోకి తీసుకుంటామని చెప్పి ఆశ్చర్యపరిచారు. అయితే కుటుంబాలే పదవులు పంచుకుంటున్నాయన్న ప్రచార అస్త్రం వైసిపి చేతికి అందనుంది.
* ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టాలని
ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించారు మెగా బ్రదర్ నాగబాబు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఎలమంచిలిలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి వెళ్ళింది. దీంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పోనీ రాజ్యసభ పదవి ద్వారా పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావించారు. కానీ చివరి నిమిషంలో మారిన సమీకరణలు అవకాశము లేకుండా చేశాయి. అయితే ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు ఏకంగా నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకోవాలని భావించారు. అధికారికంగా ప్రకటన కూడా చేశారు. దీంతో నాగబాబు మంత్రి కావడం ఖాయం. అయితే పవన్ విన్నపం మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* నాగబాబుకు కీలక శాఖ
నాగబాబు ప్రస్తుతం ఏ సభలోను సభ్యుడు కాదు. ప్రస్తుతం మండలి లో ఉన్న నలుగురు వైసీపీ సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. మరోవైపు మార్చిలో వైసీపీ ఎమ్మెల్సీలు చాలామంది పదవి విరమణ చేస్తారు. సో నాగబాబుకు ఎటువంటి చింత లేదు. మంత్రిగా ఎన్నికయ్యేవారు తప్పనిసరిగా ఆరు నెలల్లో చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన నాగబాబుకు ఇంకా సమయం ఉంది. అందుకే ముందుగా ఆయనతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. మెగా కుటుంబ సభ్యులకు కోరిక మేరకు.. మూడు పార్టీల ప్రముఖుల సమక్షంలో నాగబాబు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనకు కీలకమైన సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ శాఖను జనసేనకు చెందిన కందుల దుర్గేష్ కు అప్పగించారు. ఆ శాఖను తిరిగి నాగబాబుకు అప్పగించనున్నారు. దాంతోపాటు వినతుల విభాగమైన గ్రీవెన్స్ కు సంబంధించిన శాఖను కూడా నాగబాబుకు కేటాయిస్తారని తెలుస్తోంది. మొత్తానికైతే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో ప్రభుత్వం నిండిపోతోందని వైసీపీ అప్పుడే ఆరోపణలు చేయడం ప్రారంభించింది. మున్ముందు దీనిని తీవ్రతరం చేయనుంది. మరి ఈ ప్రచారాన్ని కూటమి పార్టీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.