తాజా బులిటెన్ ప్రకారం ఒక్క కృష్ణా జిల్లాలోనే ఒక్కరోజే 52 కరోనా పాజిటివ్ కేసులు నమోడవటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థాయిలో జిల్లాలో కేసులు నమోడవటం ఇదే తొలిసారి. వైరస్ భరినపడిన వారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో కృష్ణలంక, మాచవరం ప్రాంతాలు ఉన్నాయి.
కృష్ణలంకకు చెందిన ఇద్దరు డ్రైవర్లు నిర్వాకం వల్ల నగరంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ ట్రక్ డ్రైవర్, చుట్టుపక్కల ఉన్న వారిని పేకాట ఆడేందుకు పిలిచాడు. వారితో కలిసి పేకాట ఆడాడు. తనలో కరోనా ఉందని తెలియకుండానే అతను చేసిన ఈ పని అతని ద్వారా మరో 24 మందికి వైరస్ ను అంటించింది. మరో ఘటనలో ఇదే ప్రాంతంలోని కార్మికనగర్ లో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ ఇంటింటికి తిరిగి పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని వారందరికీ వైరస్ వ్యాప్తి అయ్యేలా చేశాడు. ఈ రెండు ఘటనల కారణంగానే, గడచిన రెండు రోజుల్లో నగరంలో 40 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా, ఆదివారం ఒక్కరోజే 52 కేసులు గుర్తించారు. వీరిద్దరు లారీ డ్రైవర్ ల నిర్వాకానికి తాజాగా 300 క్వారెంటైన్ తరలించాల్సి వచ్చింది.
భౌతిక దూరాన్ని పాటించడంలో వీరందరూ విఫలమైన కారణంగానే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విజయవాడ ప్రాంతం, ఏపీలోనే పెద్ద హాట్ స్పాట్ గా అవతరించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 15 శాతం… అంటే సుమారు 150 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు. గుణదల కొండ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద స్థానికులు భారీగా చేరి పేకాట ఆడుతున్నారు. అదేవిధంగా మద్యం సేవిస్తున్నారని అక్కడి నిర్వాహకులు తెలిపారు.