
‘‘ట్రాక్టర్లపై కిక్కిరిసి చాలా మందితో వచ్చారు.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దొరికిన వారిని దొరికినట్లు నరికేసుకుంటూ వెళ్లారు. మూడు రోజుల తరువాత గానీ శవాలు దొరకలేదు. ఒక్కో శవం ఒక్కో చోట పడి ఉంది. కొన్ని శవాలను తుంగభద్రలో పడేశారు.’’
‘‘సినిమా థియేటర్లో తనకు కాలు తగిలిందని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ పెద్దదైంది. ఆ తరువాత రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో లెక్కలేనన్ని ప్రాణాలు పోయాయి.’’
‘‘డీలర్ల మీటింగ్ జరుగుతందని నౌకర్లు వచ్చి కబురు చేశారు. దీంతో అక్కడికి బయలు దేరాడు ఓ వర్గానికి చెందిన వ్యక్తి. అతనిపై ఒక్కసారిగా 60 మంది గుంపులుగా వచ్చి మీద పడ్డారు. ఈలోగా ఓ వ్యక్తి గొడ్డలితో అతడి కాలిపై వేటు వేశాడు..’’
ఇవన్నీ 1991 సంవత్సరంలో జరిగిన సంఘటనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చుండూరు గ్రామం వెళితే ఇలాంటి విషయాలే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో దళితులపై జరిగిన మారణ హోమం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అక్కడి వాళ్లు. అప్పటి సంగతులను గుర్తు చేసుకొని భయాందోళనకు గురవుతున్నారు. అగ్ర, నిమ్న కులాల మధ్య సాగిన పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ కన్నీరు కారుస్తున్నారు.
కులాల ఆధిపత్యం కోసం కొన్ని వర్గాలు దళితులపై చేసిన దాడులు అంతా ఇంతా కాదు. చుండూరు నుంచి వేరుపడి ప్రస్తుతం అంబేద్కర్ కాలనీగా ఉన్న ఇళ్లపై జరిగిన మారణకాండ ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా ఉంది. 1991 ఆగస్టు 6న రెండు వర్గాల మధ్య జరిగిన పోరులో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఆ తరువాత తన సోదరుడు చనిపోవడాన్ని చూసి పరిశుద్ధరావు అనే దళితుడు గుండెపోటుతో మరణించాడు. శవాల కుప్పులు, నదుల్లో, కాలువల్లో మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. ఇక గొనె సంచుల్లో శవాలను చూసిన పోస్టుమార్టం చేసే డాక్టర్ రవి చందర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కులం పేరుతో కొన్ని వర్గాలు దళితుల ప్రాణాలు తీసిన ఘటనపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోనూ ఈ మారణకాండపై నినదించారు. ఈ సంఘటనపై మాజీ ప్రధాని పీవీ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్ కూడా మాట్లాడారు. చివరికి చుండూరులో జరిగిన ఘటనపై కొప్పెర్ల అనిల్ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అయితే పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. దీంతో ఇక్కడ జరిగిన ఆందోళనలో ఓ మహిళ చనిపోయింది.
దళితుపై జరుగుతున్న దాడులను సహించలేని యువత ఆ వర్గాలపై ఎదురుదాడికి వెళ్లింది. దీంతో వారిని సాంఘిక బహిష్కరణ చేశారు. అయితే బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా శాంతి కమిటీలో మేముండమని రెడ్డి సామాజికవర్గం తెగేసి చెప్పడం సమస్యగా మారింది.
రెడ్లు, దళితుల మధ్య జరిగిన గొడవతో ఆగస్టు 5న ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన రేషన్ డీలర్ గోళ్లమూడి యాకోబుపై అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత జరిగిన డీలర్ల సమావేశంలో యాకోబ్ పై కొందరు గుంపులుగా వచ్చి దాడి చేశారు. ఆయన కాలిపై గొడ్డలితో వేటు వేశారు. ఇప్పటికీ ఆయన డీలర్ గా కొనసాగుతున్నారు.
విజయ్ పాల్ అనే యువకుడు ఓ వర్గానికి చెందిన మహిళను వేధించాడనే నెపంతో అతనిపై ఆగస్టు 6న ఉదయం దాడి చేశారు. ఈ ఘటన మొత్తం మారణకాండకు దారితీసిందని అక్కడున్నవారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ దాడులతో కొందరు భయంతో పరుగులు పెట్టగా.. ఎదురెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా కారంచేడు ఘటన లాగే చుండూరులో జరిగిన గత స్మృతులు ఇప్పడికీ అక్కడికి వెళితే దర్శనమిస్తాయి.
