AP Transport Department: ఏపీలో ఇప్పుడు సరికొత్త వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20,000 జరిమానా విధించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అయితే అది నిజమా కాదా అన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఏపీ ప్రభుత్వం సైతం దీనిపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.
ఇటీవల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. పోలీస్, రవాణా శాఖలు కట్టడి చర్యలు చేపడుతున్నా పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. డ్రైవింగ్లో హెడ్ ఫోన్స్,ఇయర్ ఫోన్స్ వాడకం ప్రమాదాలకు ప్రధాన కారణం అని గణాంకాలు చెబుతున్నాయి. అంతులేని ప్రాణనష్టానికి అవే కారణాలుగా మారుతున్నాయని అధికారులు సైతం గుర్తించారు.
సెల్ ఫోన్ మాట్లాడుతూ కొందరు డ్రైవింగ్ చేస్తుంటారు. మరి కొందరు ఎవరికీ కనిపించకుండా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు హెడ్సెట్ పెట్టుకొని జాలీగా వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. వీటిని వాడుతూ డ్రైవింగ్ చేస్తే 20000 రూపాయల జరిమానా విధిస్తారనేది ఈ వార్త సారాంశం. ఆగస్టు నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. సంబంధించి వివరాలు రవాణా శాఖ త్వరలో వెల్లడించనుందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త వివరణ కోసం ఓకే తెలుగు న్యూస్ రవాణా శాఖ అధికారులను సంప్రదించింది. అయితే దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలకు ప్రభుత్వం దిగనుంది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ వర్గాలు చెబుతున్నాయి.