మావోయిస్టుల దొంగదెబ్బతో చిక్కుకు పోయిన పోలీసులు

వరుస ఎన్‌కౌంటర్లలో తీవ్రంగా దెబ్బతింటూ నాయకత్వం ఉనికినే కోల్పోతున్న మావోయిస్టులు అదను కోసం ఎదురు చూస్తూ, కాపు కాచి, గాలింపు చర్యల అనంతరం తిరిగి వెడుతున్న సాయుధ దళాలలను చుట్టుముట్టి దండకారణ్యంలో చావుదెబ్బ తీశారు. పోలీస్ బలగాలను తమ ఉచ్చులోకి దింపి కాల్పులకు తెగబడినట్లు చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీస్ దళాల రాకను ముందే పసిగట్టడంతో, వ్యూహాత్మకంగా వారి గాలింపు పూర్తయ్యేవరకు కనబడకుండా దాక్కొంటూ, ఇక్కడెవ్వరు మావోయిస్టులు లేరనికొని తిరిగి వెడుతున్న సమయంలో ఎత్తైన […]

Written By: Neelambaram, Updated On : March 23, 2020 11:09 am
Follow us on

వరుస ఎన్‌కౌంటర్లలో తీవ్రంగా దెబ్బతింటూ నాయకత్వం ఉనికినే కోల్పోతున్న మావోయిస్టులు అదను కోసం ఎదురు చూస్తూ, కాపు కాచి, గాలింపు చర్యల అనంతరం తిరిగి వెడుతున్న సాయుధ దళాలలను చుట్టుముట్టి దండకారణ్యంలో చావుదెబ్బ తీశారు. పోలీస్ బలగాలను తమ ఉచ్చులోకి దింపి కాల్పులకు తెగబడినట్లు చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పోలీస్ దళాల రాకను ముందే పసిగట్టడంతో, వ్యూహాత్మకంగా వారి గాలింపు పూర్తయ్యేవరకు కనబడకుండా దాక్కొంటూ, ఇక్కడెవ్వరు మావోయిస్టులు లేరనికొని తిరిగి వెడుతున్న సమయంలో ఎత్తైన ప్రదేశాల నుండి మాటు వేసి కాల్పులు జరిపి దెబ్బ తీశారు. ఊహించని పరిణామం కావడం, దట్టమైన అడవి కావడంతో తేరుకొనే లోపే తీవ్ర నష్టం జరిగిపోయింది.

చింతగుఫా పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్మాగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆధ్వర్యంలో నగేష్, వినోద్, దేవా, తదితర నేతలతో పాటు 300మంది మావోయిస్టులు సమావేశమయ్యారని చత్తీస్‌గఢ్ ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దాంతో డోర్నపాల్ పోలీసు స్టేషన్ నుంచి 200 మందిని, బూర్కాపాల్ క్యాంపు నుంచి 150 మందిని ఈ ప్రాంతానికి నేరుగా కూంబింగ్ ఆపరేషన్ కోసం పంపారు.

శనివారం మధ్యాహ్నం గాలింపు పూర్తి చేసుకొని బలగాలు తిరుగుముఖం పట్టాయి. అయితే మావోలు అంబూష్ చేయడంతో బలగాలు చిక్కుకుపోయాయి. బలగాలు తమను సమీపిస్తున్నాయన్న సమాచారం తెలుసుకున్న మావోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు ధరించి సిద్ధమయ్యారని తెలుస్తున్నది.

భారీ అటవీ ప్రాంతానికి బలగాలు చేరుకోగానే అక్కడే దారికాచి ఉన్న సాయుధులైన మావోలు అన్నివైపుల నుంచి కాల్పులకు దిగారు. పక్కా ప్రణాళికతో ఉన్న మావోయిస్టులు గుట్టలపై అప్పటికే ఏర్పాటు చేసుకున్న సురక్షిత ప్రదేశాల నుంచి గ్రెనేడ్స్‌, రాకెట్‌ లాంచర్లు, అత్యాధునికి ఆయుధాలతో జవాన్లపై విరుచుకుపడ్డారు. దీంతో మావోయిస్టులదే పైచేయిగా మారింది. దాదాపు 2 గంటలపాటు ఇరుపక్షాల నడుమ హోరా హోరీ కాల్పులు జరిగినట్లు సమాచారం.

అప్పటికే కూంబింగ్ చేసి అలసిపోవడంతో ఈ దాడిని భద్రతా జవాన్లు అసలు ఊహించలేకపోయారు. ఆకస్మాత్తుగా కాల్పులు జరగడంతో వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. మావోలు తూటాల వర్షం కురిపించడంతో భద్రతా బలగాలు చెల్లాచెదురయ్యాయి. అనంతరం రెండున్నర గంటల తర్వాత కాల్పులు ఆగిపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బలగాలు క్యాంప్‌కు చేరుకున్నాయి.

మావోలు అపహరించిన జవాన్ల కోసం ఆదివారం డ్రోన్ల సాయంతో అన్వేషించారు. ఈ క్రమంలో కాల్పులు జరిగిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో అదృశ్యమైన 17మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వెంటనే మృతదేహాలను బలగాలు అడవి నుంచి బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనలో 12మంది డీఆర్‌జీ, ఐదుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది చనిపోయినట్లు నక్సల్స్ ఆపరేషన్ డీజీపీ అవస్థీ ప్రకటించారు.

ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం ఇటీవల ‘ఆపరేషన్‌ ప్రహార్‌’తో మావోయిస్టులను అణచివేసే కార్యక్రమం చేపట్టింది. దీంతో జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు.

ఆపరేషన్‌ ప్రహార్‌కు ప్రతీకారంగా మావోయిస్టు కేంద్ర కమిటీ ఛత్తీ్‌సగఢ్‌లో ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటికప్పుడు జవాన్ల సంచారాన్ని పసిగట్టి, పక్కా ప్రణాళికతో జవాన్లను దెబ్బ కొట్టడం బెటాలియన్‌ పని.