Homeజాతీయ వార్తలుAmbedkar Statue: నింగి తొంగి చూసేలా.. నేల అచ్చెరువొందేలా: అంబేద్కర్ విగ్రహ విశేషాలివే

Ambedkar Statue: నింగి తొంగి చూసేలా.. నేల అచ్చెరువొందేలా: అంబేద్కర్ విగ్రహ విశేషాలివే

Ambedkar Statue
Ambedkar Statue

Ambedkar Statue: అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాదులో 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశం అంబేద్కర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈ అంబేద్కర్ విగ్రహం విశేషాలు ఒకసారి తెలుసుకుందాం.

భూమి నుంచి చూస్తే ఇది 175 అడుగుల స్మారకంగా కనిపిస్తుంది. పీఠం 50 అడుగులు నిర్మించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు. బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఎత్తైనదిగా ఖ్యాతిఘడించబోతోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి గుర్తుగా పార్లమెంటు పీఠంపై.. బాబాసాహెబ్ నిల్చున్నట్టుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హుసేన్ సాగర్ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపింది. 50,000 మంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేసింది.

అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాదులో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అమెరికా తరహాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో నిర్మించి పర్యాటక, విజ్ఞాన ప్రదేశంగా తీర్చి దిద్దుతామాని అప్పట్లో వెల్లడించింది. ఈ మేరకు 146 కోట్ల నిధులు కేటాయించింది. హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ను ఆనుకొని దాదాపు 12 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. నిర్మాణ పనులకు ఎస్సీ క్షేమ శాఖ నిధులు అందించింది. నిర్మాణ బాధ్యతలను రోడ్లు భవనాలు శాఖ పర్యవేక్షించింది. ఆ శాఖకు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈ ప్రాజెక్టు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకోగా.. అధ్యయనం, నిర్మాణ శైలి తదితర పనుల నేపథ్యంలో నిర్మాణంలో జాప్యం జరిగింది.

Ambedkar Statue
Ambedkar Statue

ఇక దీనికి సంబంధించిన నిర్మాణం బాధ్యతలను కెపిసి ప్రాజెక్టు లిమిటెడ్ చేపట్టింది. స్తూపాన్ని నిర్మించిన తర్వాత విగ్రహ భాగాలను ఢిల్లీలో సిద్ధం చేశారు. హైదరాబాద్ కు ప్రత్యేక భారీ వాహనాల ద్వారా తరలించారు. భారీ క్రేన్ల సహాయంతో వాటిని గ్రామ పద్ధతిలో అమర్చారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలాగా లోహ సామాగ్రి వినియోగించారు. అంబేద్కర్ విగ్రహ పాదాల వద్దకు చేరుకునే విధంగా మెట్లను నిర్మించారు. 15 మంది ఎక్కే సామర్థ్యంతో రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఇక విగ్రహం కింద, పీఠం లోపల స్మారక భవనంలో 27,556 అడుగుల నిర్మిత స్థలం ఉంది. ఇక్కడ మ్యూజియం, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో కూడిన ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు.

భవనం లోపల ఆడియో విజువల్ రూమ్స్ ఉన్నాయి.. ఈ గ్యాలరీ కోసం ఆ మహనీయుని జీవిత విశేషాలు సంబంధించిన అరుదైన చిత్రాలను సమీకరించేందుకు ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మ్యూజియంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. గ్రంథాలయంలో అంబేద్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులోకి తీసుకొస్తారు. స్మారకం వెలుపల పచ్చదనం కోసం దాదాపు మూడు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. స్మృతి వనంలో రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్ ఫౌంటేన్, సాండ్ స్టోన్ ఉన్నాయి. స్మృతి వనంలో 450 కార్ల వరకు పార్క్ చేయవచ్చు.

ఈ విగ్రహ ఏర్పాటుకు ఏప్రిల్ 14 , 2016 లో శంకుస్థాపన చేశారు. 147 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. డిజైన్ అసోసియేట్స్ నోయిడా అనే కంపెనీ కన్సల్టెంట్ సంస్థగా వ్యవహరించింది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక అనుమతి 2021 జనవరి 23లో వచ్చింది. 2021 జూన్ 3న కాంట్రాక్టర్తో ఒప్పందం కుదిరింది. ఒప్పందం విలువ 104 కోట్లుగా నిర్ణయించారు.. ఇప్పటివరకు 83.69 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఈ విగ్రహం పీఠం ఎత్తు 50 అడుగులు, వెడల్పు 172 అడుగులు, విగ్రహం బరువు 465 టన్నులు, విగ్రహం వెడల్పు 45 అడుగులు, 791 టన్నుల ఉక్కును వినియోగించారు. 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి విగ్రహం తయారీకి ఉపయోగించారు. 425 మంది కార్మికులు ఈ విగ్రహ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం 10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. రెండు లక్షల బాటిళ్ళ మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, 80 వేల స్వీట్ ప్యాకెట్లు సిద్ధం చేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా పీఠం లోపల ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ కు అవసరమైన కసరత్తు పూర్తయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రిని 30 మంది బౌద్ధ గురువులు ప్రార్ధనలతో అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత స్తూపం లోపల ఉన్న లిస్టులో ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహం పాదాల వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడ 20 మంది భౌద్దగురువులు ప్రార్థనలు చేస్తారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular