కేంద్రం మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా 15 మందికి చోటు దక్కింది. అదే సమయంలో పాత కేబినెట్లోంచి 12 మందిని తొలగించారు. అయితే.. వీరిలో ఊహించని సీనియర్లు కూడా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. న్యాయ, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, సమాచార, ప్రసార, అటవీ, భారీ పరిశ్రమల శాఖలు చూసిన ప్రకాశ్ జవదేకర్ కూడా ఉద్వాసన పలికినవారిలో ఉండడం నివ్వెపరిచింది. దీంతో.. వీరి తొలగింపునకు కారణాలు ఏంటనే చర్చ సాగుతోంది.
అయితే.. వీరి పనితీరునే పరిగణనలోకి తీసుకున్నారని భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రభుత్వం తీవ్ర అప్రతిష్టను మూటగట్టుకుంది. మోడీ ఇమేజ్ తగ్గిపోతోందనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు, వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కూర్పు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే.. మొహమాటాలకు తావులేకుండా పనితీరును బట్టి చేర్పులు, మార్పులు సాగాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రవిశంకర్ ప్రసాద్ ను తప్పించడానికి ట్విటర్ వివాదమే కారణంగా తెలుస్తోంది. ఈ విషయం ఎంత రచ్చ అయ్యిందో తెలిసిందే. ట్విటర్ రచ్చ కారణంగా.. భారత్ లో మీడియాను అణచివేస్తున్నారనే అభిప్రాయం ప్రపంచానికి కలిగిందని మోడీ సర్కారు భావిస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూను డీల్ చేయడంలో రవిశంకర్ వెనుకబడ్డారని భావించి పక్కన పెట్టారని అంటున్నారు.
ఇక, మరో మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను తప్పించడానికి మాత్రం వేరే కారణాలు ఉన్నాయని అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ మందికి చోటు ఇవ్వడం వల్లే.. ఈయన్ను పక్కన పెట్టారని చెబుతున్నారు. సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకున్న ఛాన్స్ లేకపోవడం కారణంగా.. ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. దీంతో.. ఆయనకు మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించడం కానీ.. లేదంటే గవర్నర్ గా పంపడంకానీ జరగొచ్చని అంటున్నారు.
వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ను తప్పించడానికి కరోనానే కారణంగా చెబుతున్నారు. కొవిడ్ నియంత్రణలో ఆయన యాక్టివ్ గా లేకపోవడం వల్లే పరిస్థితి ఇబ్బందికరంగా మారిందంటూ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆ విధంగా.. కరోనా సెకండ్ వేవ్ ఆయన మీదుగా వెళ్లదీసింది కేంద్రం. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు అనారోగ్యం, సరైన పనితీరు ప్రదర్శించకపోవడమే రీజన్ అంటున్నారు. సదానంద గౌడ, సంతోష్ కుమార్ గంగ్వార్, బెంగాల్ కు చెందిన బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌదురి వంటివారు కూడా సరైన ప్రభావం చూపలేకపోయారనే కారణంతోనే ఇంటికి పంపేసినట్టు తెలుస్తోంది.