Mann Ki Baat 100th Episode: ప్రధాని నరేంద్ర మోడీ సెంచరీ కొట్టబోతున్నారు. ప్రధాని క్రీడాకారుడు కాదు కదా.. సెంచరీ కొట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. నిజమేనండి మరో రెండు రోజుల్లో మోదీ తనకు ఇష్టమైన మన్‌కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ క్రమంలో ఆయన తన పెద్ద మనసు చాటుకున్నారు. తనకు అవసరం.. బీజేపీకి మేలు చేస్తుందని భావించిన కార్యక్రమం వందో ఎపిసోడ్ సందర్భంగా రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి అంగీకరించారు. ఇందుకు అధికారులు ప్రతిపాదన చేయగానే.. అందుకు మోదీ ఓకే చెప్పేశారు.
2014 నుంచి మన్‌కీ బాత్..
కేంద్రంలో బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. మోదీ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి ఆయన మన్ కీ బాత్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం ఇది. దీనిని పర్యవేక్షించేందుకు సెక్రటరీ స్థాయి అధికారులతో పెద్ద బృందమే ఉంది. వీరు రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ.. ప్రజల ఉంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ.. వారి నుంచి ఉత్తరాలు తీసుకుంటూ.. ఈ మన్‌కీ బాత్‌ను తీర్చి దిద్దుతున్నారు.
రేడియో మాధ్యమం ద్వారా..
ప్రతినెలా చివరి ఆదివారం రేడియో మాధ్యమం ద్వారా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి తన మనసులోని భావాలను పంచుకుంటారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల సంస్కృతులు.. కళలు.. ఇతరత్రా విషయాలు.. అవార్డులు.. రోగాలు, వ్యాక్సిన్లు ఇలా.. అదీ ఇదీ.. అనే తేడా లేకుండా అన్నీ మాట్లాడుతున్నారు. ఇక, ఇప్పుడు 2024 ఎన్నికలకు ముంగిట.. ఈనెల 30న వందో ఎపిసోడ్ ప్రసారం కానుంది.
80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం..
మోదీ వందో మన్‌కీ బాత్ ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్ కూడా ఉంది. అక్కడ కూడా.. ప్రత్యేక అనుమతులు తీసుకుని ప్రసారం చేయనున్నారు. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి.. జీ20 సదస్సుల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఇక, నగరాలు.. పట్టణాలు.. నియోజకవర్గాలు(మొత్తం 547 పార్లమెంటుస్థానాల్లో), గ్రామాల్లోనూ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి.. ప్రసారం చేస్తారు. దీనికి గాను మొత్తం రూ.100 కోట్లు విడుదల చేసేందుకు మోడీ సంతకం చేశారు.
ఎన్నికల వేల పార్టీకి లబ్ధి..
ప్రధాని మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్ ద్వారా పార్టీకి కూడా లబ్ధి కలుగుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్నందున దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈమేరకు మోదీ ప్రసంగం వినేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధిష్టానం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మోదీ వందో ఎపిసోడ్‌లో ఏం మాట్లాడతారు అన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. మరో రెండు రోజుల్లో మోదీ ఏం మాట్లాడతారో తెలిస్తుంది.