BJP- Chandrababu: తెలుగుదేశం పార్టీతో బిజెపికి పొత్తు కుదిరిందా? అందుకే చంద్రబాబుకు ఐటి నోటీసుల విషయంలో కేంద్రం సాయం చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పొలిటికల్ సర్కిల్లో వార్త ట్రెండింగ్ గా మారింది. చంద్రబాబు ఆ మధ్యన అమిత్ షాకును కలిసినప్పుడే పొ త్తు కుదురుతుందన్న టాక్ నడిచింది. కానీ అటు తర్వాత చంద్రబాబు సైలెంట్ అయ్యారు. అటు బిజెపి నేతలు సైతం ఏ విషయం వెల్లడించలేదు.
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి బలం తక్కువ. ఒక్క కర్ణాటక తప్పించి చెప్పుకోదగ్గ బలం ఆ పార్టీకి లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణలోనే ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. నాలుగు ఎంపీ సీట్లను ఆ పార్టీ దక్కించుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలో సైతం ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమే. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అప్పటినుంచి ఆ పార్టీ పునరాలోచనలో పడింది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలుచుకున్న చోట ఒకలా.. పొత్తుల ద్వారా మరోలా వ్యూహాలను రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కనీసం 10 ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది.
అయితే బిజెపికి ఏపీలో అంత బలం ఉందంటే.. అంత సీన్ లేదని సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి తో బిజెపికి మంచి సంబంధాలే ఉన్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నారు కూడా. అయితే వారు కలిసి నడవలేని పరిస్థితి. మరోవైపు టిడిపి పొత్తునకు సిద్ధంగా ఉంది. అటు జనసేన సైతం కలిసి వస్తోంది. దీంతో ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్లడమే శ్రేయస్కరమని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. అటు చంద్రబాబు సైతం కోరినన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు అవసరం దృష్ట్యా వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఒంగోలు, నరసరావుపేట, నరసాపురం ఎంపీ స్థానాలను బిజెపికి ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం మరో మూడు అదనంగా ఎంపీ సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు సైతం ఎంపీ సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో చంద్రబాబు ఏ నిర్ణయము తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సీట్లు పరంగా బిజెపి కంటే జనసేనకే అధికంగా కేటాయించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అటు బిజెపి సైతం అసెంబ్లీ స్థానాలతో పని లేకుండా.. ఎంపీ సీట్లనే ఎక్కువగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఏపీలో పొత్తుల ప్రక్రియ వేగవంతం అయినట్లు తెలుస్తోంది.