
Nara Lokesh : నారా లోకేష్ ను ‘పప్పు’ అని కామెంట్ చేయడం తెలిసిందే. లోకేష్ ప్రసంగం, తొట్రుపాటు కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చాయనే అభిప్రాయం ఉంది. తద్వారా.. లోకేష్ ను ఓ కామెడీ పీస్ చేసే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు. ఆయన రాజకీయాలకు పనికిరాడు, చంద్రబాబు కొడుకుగా మాత్రమే కొనసాగుతున్నారు అంటూ.. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ భారీగా ప్రచారం చేసింది. అయితే.. దేనికైనా పీక్ స్టేజ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కిందకు పడిపోవడమే. ఇప్పుడు లోకేష్ కు సంబంధించిన నెగెటివ్ ప్రచారం విషయంలోనూ ఇదే జరుగుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాదు.. లోకేష్ మాస్ లీడర్ గా ఎదగడానికి పరోక్షంగా అధికార పార్టీనే సహకరిస్తున్నట్టు కనిపిస్తోంది.
రాజకీయం సాఫీగా సాగిపోతే పెద్దగా ఉపయోగం ఉండదని భావిస్తారు నేతలు. సంచలనం నమోదు కావాలి. దానికి కేంద్రబిందువు తామే కావాలని చూస్తారు. తద్వారా ప్రజల్లో పాపులర్ కావాలని అనుకుంటారు. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. ఇలాంటి సంచలనాల్లో ఒకటి అరెస్టు కావడం. సాధారణ వ్యక్తుల విషయంలో జైలుకు వెళ్లి రావడం అనేది నామోషీగా ఉంటుంది. కానీ.. రాజకీయ నాయకుల లెక్క మరోలా ఉంటుంది. అరెస్టై, జైలుకు వెళ్లి వచ్చిన వారికి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోతోంది. దీనికి ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి.
జగన్ ను జైల్లో పెట్టకపోతే.. ఇంత పెద్ద లీడర్ అయ్యేవారు కాదన్నది విశ్లేషకుల మాట. ఇదే జైలుకు వెళ్లిరాకపోతే.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కేది కాదన్నది అదే విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు నారా లోకేష్ కూడా ఇదే విధంగా ఎదగాలని చూస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే.. దీనికి వైసీపీ కూడా పరోక్షంగా సహకరిస్తోందని అంటున్నారు.
ఆగస్టు 15న హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్, టీడీపీ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో.. ఈ విషయం గట్టిగానే చర్చనీయాంశం అయ్యింది. తాజాగా.. నర్సారావుపేట పర్యటనకు వెళ్లిన లోకేష్ ను అడ్డుకునేందుకు వందలాది మంది పోలీసులు చుట్టు ముట్టడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. పరామర్శకు వెళ్లిన లోకేష్ ను ఇంత మంది చుట్టుముట్టాల్సిన అవసరం ఏంటీ? ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా? అన్న రీతిలో చర్చ సాగుతోంది.
ఈ విధంగా లోకేష్.. తనపై పడిన ముద్రను చెరిపేసుకుంటూ మాస్ లీడర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారని, దానికి సర్కారు కూడా తన చర్యల ద్వారా ఊతమిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఇదంతా వైసీపీ వ్యూహంలో భాగమా? లేక వ్యూహాత్మకంగా జరుగుతున్న తప్పిదమా? అనే చర్చకూడా జరుగుతోంది. మొత్తానికి లోకేష్ మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. మరి, మున్ముందు లోకేష్ కు ఇంకెలా పాపులారిటీ వస్తుంది? అన్నది చూడాలి.