
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత.. సర్కారు ఏర్పాటుకు తాలిబన్లు చర్చోపచర్చలు సాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్ ప్రభుత్వ అధినేతగా ముల్లా బరాదర్ ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు తాలిబన్ నేతలు ఈ విషయాన్ని ధృవీకరించారని ఆంగ్ల మీడియా వెల్లడించింది.
తాలిబన్ వ్యవస్థాపకుల్లో బరాదర్ ఒకరు. ముల్లా ఒమర్ తో కలిసి ఆయన తాలిబన్ ను స్థాపించారు. దుర్రానీ పష్తూన్ తెగకు చెందిన బరాదర్.. 1968లో ఆఫ్ఘన్ లోని ఉర్జాన్ ప్రావిన్స్ లో జన్మించారు. 70వ దశకంలో సోవియట్ సేనలు ఆఫ్ఘన్ ను ఆక్రమించడంతో.. తిరుగుబాటు చేసిన బృందంలో చేరాడు. సోవియట్ రష్యా సైన్యం వెళ్లిపోయిన తర్వాత దేశంలో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లడం.. అంతర్యుద్ధం నెలకొన్న పరిస్థితుల్లో తాలిబన్ కు అంకురార్పణ జరిగింది.
అప్పటి నుంచి తాలిబన్ కీలక నేతగా ఉంటూ వచ్చాడు బరాదర్. అయితే.. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా సర్కారు భావించిందో.. అప్పుడు బరాదర్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ట్రంప్ హయాంలో 2020 ఫిబ్రవరి 29న ఈ మేరకు తాలిబన్లతో అమెరికాకు ఒప్పందం కుదిరింది. అదే ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముల్లా బరాదర్ తో ఫోన్లో మాట్లాడారు. దీంతో.. తాలిబన్ నేత పేరు ప్రపంచ వ్యాప్తమైంది.
అప్పటి నుంచి పలు దేశాల నాయకులతో చర్చలు జరుపుతూ వచ్చారు బరాదర్. ఈ మధ్య చైనాను సందర్శించిన తాలిబన్ బృందానికి ఈయనే నాయకత్వం వహించారు. ఈ విధంగా.. తాలిబన్ సంస్థకు అధినేతగా ఉన్న బరాదర్.. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన ప్రభుత్వానికి అధినేత అయ్యారు.
అయితే.. ఆఫ్ఘన్లో ఎలాంటి పాలన అందిస్తారు? అనే ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. దేశాన్ని ఆక్రమించుకున్న తొలిరోజుల్లో తాలిబన్లు చెప్పిన మాటలకు.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోయింది. యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ నిషేధం, మ్యూజిక్ పూ నిషేధం విధించడంతోపాటు.. రేడియో, టీవీ సంస్థల్లో మహిళలు పనిచేయకుండా ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి, బరాదర్ నేతృత్వంలోని తాలిబన్ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో చూడాలి.