
ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో జగన్ సర్కారు మీద విమర్శలు చేసి వివాదాల్లోకి వెళ్లిన సుధాకర్ శుక్రవారం మృతి చెందారు. ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు తెలిసింది. సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వైసీపీ కక్ష్య సాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని.. ఆయన మృతికి సీఎం జగన్ బాధ్యత హించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఆయన్ను బాధ్యుడిని చేసి ఆడుకున్నారని వాపోయారు. సుధాకర్ మృతితో అందరు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.
నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చీఫ్ డాక్టర్ గా ఉన్న సుధాకర్ వైద్యులకు మాస్కులు ఎందుకు ఇవ్వడం లేదని జగన్ సర్కారుపై విమర్శలు చేసి వార్తల్లో కెక్కారు. ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడడం, ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో తరువాత పరిణామాల్లో ఆయన విశాఖపట్నంలో రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించారు. తరువాత పోలీసులు ఆయన కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి కర్రలతో కొట్టడం సంచలనం కలిగించింది.
సుధాకర్ వ్యవహరించిన తీరుపై కోర్టు ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించింది. తర్వాత సుధాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసింది. తన ఉద్యోగం తనకు ఇప్పించాలని సుధాకర్ మీడియా ముందు మాట్లాడారు. ఆ తర్వాత అందరూ ఆ కేసును మరిచిపోయారు. ఈ సమయంలో ఆయన మరణవార్త అందరినీ కదిలించింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వంపై ఆరోపణలు చేసినందుకే ప్రాణాలు కోల్పోయాడని పలువురు చర్చించుకుంటున్నారు. జగన్ సర్కారు చేసిన వ్యవహారాలతోనే డాక్టర్ తనువు చాలించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుధాకర్ మరణంపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలతోనే బలిపశువులుగా మార్చతున్నారని విమర్శించారు.