
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాటలు తడుముకోకుండా, కపటం లేకుండా, నిష్కర్షగా మాట్లాడుతూ సంచలన రాజకీయ ప్రకటనలు చేస్తూ తరచూ వార్తలలో కనిపిస్తుంటారు. తాజాగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి `కుల’ రాజ్యాన్ని ప్రశ్నించడం ద్వారా పెను దుమారం రేపారు.
పైగా, `కమ్మ’ కులస్థుల పట్ల `వివక్షత’ చూపుతున్నారని అంటూ మండిపడ్డారు. ఆ కులం వారి పేరు కనబడితేనే పక్కన పెట్టివేస్తున్నారని అంటూ విరుచుకు పడ్డారు. ఆ విధంగా చేయడం రాజకీయంగా మంచిది కాదంటూ జగన్ కు హితవు చెప్పారు. వీరేమి చేస్తారులే అనుకొంటే రాజకీయంగా ఎదురు దెబ్బ తప్పదని అంటూ సున్నితంగా హెచ్చరించారు.
అదీ కాకుండా, ఈ ప్రభుత్వంలో కేవలం `రెడ్డి’ సామజిక వర్గం వారికే కీలక పదవులన్నీ లభిస్తున్నాయని అంటూ విరుచుకు పడ్డారు. బలహీన వర్గాలు, మహిళలకు సగం పదవులు ఇస్తామని చెప్పిన జగన్, తన సామజిక వర్గం వారినే అందలం ఎక్కిస్తున్నారని అంటూ చెప్పుకొచ్చారు.
రాయపాటి చేసిన విమర్శలు అన్ని జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. గత పది నెలల్లో ఈ ప్రభుత్వంలో సుమారు 500 మంది ఒకే సామజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు కట్టబెట్టారని అంటూ సోషల్ మీడియాలో పేర్లతో సహా ప్రచారం జరుగుతున్నది. అయితే ఒక సీనియర్ రాజకీయ నోటినుండి వెలువడడంతో రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నాయి.
ఒక సారి రాజ్యసభకు, ఐదు సార్లు లోక్ సభకు ఎన్నైనా, ఆయనకు సొంత పార్టీలోనే తీవ్రమైన ప్రత్యర్ధులు ఉంటూ వచ్చారు. అయితే సుదీర్ఘకాలం ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నా సాధారణ ప్రజలలో ఆయన పట్ల సానుభూతి, ఆదరణ భావాలే నెలకొంటూ ఉన్నాయి. దానితో ఆయన ప్రకటన సాధారణ జనంలో కలకలం రేపే అవకాశం ఉంది.
ముఖ్యంగా మాజీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పట్ల ఈ ప్రభుత్వం జరుపుతున్న దాడులపై రాయపాటి మండిపడ్డారు. గత నెలలో రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేయని పక్షంలో రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి వేల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు.
అదే విధంగా మూడు రాజధానులపై జగన్ గుడ్డిగా ముందుకు వెడితే రాజకీయాలలో `జీరో’ కాగలరని రాయపాటి హెచ్చరించారు. కరోనా మహమ్మారి సద్దుమణిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలసి జగన్ దుశ్చర్యలపై ఫిర్యాదు చేయగలనని రాయపాటి తెలిపారు. జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో రాయపాటి సన్నిహితంగా ఉండడం గమనార్హం.