
జనవరి 3న ఇరాన్ లో జరిగిన దాడిపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కమాండర్ జనరల్ ఖాసిం సులేమానీపై దాడిని అధికారికంగా ప్రకటించారు. అమెరికా పౌరులను కాపాడుకోవడంలో భాగంగానే దాడి చేసినట్లు పునరుద్ఘాటించారు. అమెరికా దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అందుకే ఆయన్ని హతమార్చాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి సహా ఇరాక్‌లోని అమెరికా మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారి అని పేర్కొన్నారు. అమెరికా సంకీర్ణ దళాలకు చెందిన వందల మంది సైనికుల మరణాలకు, వేల మంది గాయపడటానికి అతడిదే బాధ్యత అని ఆరోపించారు. న్యూదిల్లీ, లండన్‌లో ఉగ్రదాడులకు ప్రయత్నించారని పేర్కొన్నారు. తమ దౌత్యాధికారులు, సైనికులపై చేయబోయే మరిన్ని దాడులను అడ్డుకోవడానికే తాజాగా దాడి చేశామని సమర్థించుకున్నారు.
ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదన్నారు. ‘‘యుద్ధాన్ని ఆపడం కోసమే తాము ఈ చర్య తీసుకున్నామని.. యుద్ధాన్ని ప్రారంభించడం కోసం కాదు’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందన్నారు. అద్భుతమైన చరిత్ర, అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఇరాన్ ప్రజలను ఆయన అభివర్ణించారు. ఇరాన్లో శాంతి సామరస్యం కోరుకునే ప్రజల చేతుల్లోనే ఆ దేశ భవిష్యత్తు ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కొన్నాళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా అగ్గి రాజుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌కు శక్తిమంతమైన కమాండర్‌గా ఉన్న జనరల్ ఖాసిం సులేమానీ (62) చనిపోయారు. విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.