Covid third Wave : కరోనా మహమ్మారి ప్రపంచంపై చూపిన ప్రభావం ఒకెత్తయితే.. భారత్ పై చూపిన ఎఫెక్ట్ మరో ఎత్తు అనే చెప్పాలి. సెకండ్ వేవ్ లో దేశం పడిన అవస్థను చూసి.. యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది. నిత్యం నాలుగు లక్షల పైచిలుకు కేసులతో.. వేలాది మరణాలతో.. ఎటు చూసినా భీతావహ దృశ్యాలతో అల్లకల్లోలం నెలకొంది. నాటి పరిస్థితులను తలుచుకుంటే.. ఇప్పటికీ ఒళ్లు జలధరించకమానదు. అలాంటి సెకండ్ వేవ్ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.
దేశంలో ప్రస్తుతం రోజూవారి కేసులు 30 వేలకు దిగువన నమోదవుతున్నాయి. అయితే.. థర్డ్ వేవ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. ప్రధాన హెచ్చరికలు భారత్ కే చెబుతోంది. దీంతో.. ఆందోళన అలాగే ఉండిపోయింది. మరి, ఈ మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుంది? ఇంకా మాస్కులుఎంత కాలం ధరించాలి? అన్న ప్రశ్న ప్రతిఒక్కరినీ వేధిస్తోంది. దీనిపై నీతిఅయోగ్ (Niti aayog) సభ్యులు తాజాగా స్పందించారు.
ప్రపంచంలో పలు దేశాల్లో వ్యాక్సినేషన్ అనుకున్నమేర పూర్తయింది. దీంతో మాస్కులు వాడాల్సిన అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించాయి కూడా. కానీ.. థర్డ్ వేవ్ భయాలు మాత్రం తొలగలేదు. మనదేశానికి వచ్చే సరికి ఇంకా వ్యాక్సినేషన్ సగం కూడా పూర్తికాలేదు. అంతేకాదు.. కేసులు 30 వేల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద పండగలు ఉన్నాయి. అందువల్ల తేడా వస్తే.. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశం ఉంది.
కాబట్టి మాస్కులు కొనసాగించాల్సిందేనని అంటున్నారు. అంతేకాదు.. జనాలు కరోనా నిబంధనలు మొత్తం పాటించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నీతిఅయోగ్ సభ్యుడు వెటరన్ పీడియాట్రీషియన్ డాక్టర్ వికె పాల్ తెలిపారు. కొవిడ్ కు అవసరమైన మందులు, తగిన చికిత్స అందుబాటులోకి వచ్చేంత వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. వచ్చే ఏడాది మొత్తం భారతీయులు మాస్కులు ధరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
‘‘మన భారతదేశంలో వచ్చే ఏడాది.. అంటే 2022 మార్చి వరకు మాస్కులు ధరిస్తూనే ఉంటాం.’’ అని వికె పాల్ అంచనా వేశారు. కరోనా నివారణకు ఎలాంటి మార్గాలున్నాయి? అనే అంశాలపైనా ఆయన స్పందించారు. పెద్ద పెద్ద పండగలు, సమావేశాలు సామూహికంగా జరగకుండా చూసుకోవాలని కేంద్రం సూచించిందని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించడం ద్వారా, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా కొవిడ్ ను వ్యాప్తి చేయకుండా చూడాలన్నారు.