Brain Vacation : మెదడును ఉత్తేజితం చేసే బ్రెయిన్ వెకేషన్.. సరి కొత్త ఆలోచనలకు అవకాశం..!

ఇటువంటి వారికి బ్రెయిన్ వెకేషన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఏమిటి బ్రెయిన్ లోకేషన్..? ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో మీరు తెలుసుకోండి. బ్రెయిన్ వెకేషన్ కు వెళ్లేటప్పుడు విభిన్న రంగాలకు చెందిన, సరికొత్త ఆలోచనలు కలిగిన వాళ్లు పరిచయమవుతుంటారు. వయసులో కూడా వ్యత్యాసం ఉంటుంది.

Written By: NARESH, Updated On : July 2, 2023 2:38 pm
Follow us on

Brain Vacation : ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు, పరుగుల మయం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే అంత వరకు ఒత్తిడితో కూడిన జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, మానసిక, శారీరక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఎంతో మంది వివిధ మార్గాలను అనుసరిస్తుంటారు. యోగ, మెడిటేషన్ కొంతమంది చేస్తే.. ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్లి ఒంటరిగా ఉండేందుకు మరి కొంతమంది ఇష్టపడుతుంటారు. మ్యూజిక్ వింటూ మరికొంతమంది ప్రశాంతతను పొందుతారు. అయితే, ఈ తరహా గజిబిజి జీవితం నుంచి మెదడును రీఛార్జ్ చేసే సరికొత్త వ్యాపకాన్ని కొంత మంది మొదలుపెట్టారు. అదే బ్రెయిన్ వెకేషన్. ఈ బ్రెయిన్ వెకేషన్ తో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీ అయిపోయి చాలా మంది మానసికంగా అలసిపోతుంటారు. ఒకే పరిసరాల్లో ఎక్కువ సమయం పని చేయడం వల్ల కూడా సామర్థ్యం దెబ్బతింటుంది. ఒకే చోట ఏళ్ల తరబడి పని చేయడం వల్ల సృజనాత్మకత కూడా వృత్తిలో కనిపించడం లేదు. ఇటువంటి వారికి బ్రెయిన్ వెకేషన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఏమిటి బ్రెయిన్ లోకేషన్..? ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో మీరు తెలుసుకోండి.

కాస్త భిన్నంగా బ్రెయిన్ వెకేషన్..

ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు కొంత మంది టూర్లకు వెళుతుంటారు. సాధారణ విహారయాత్రలతో పోలిస్తే బ్రెయిన్ వెకేషన్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది కొత్త దృక్పథాన్ని, ఆలోచన విధానాన్ని అన్వేషించేందుకు దోహదం చేస్తుంది. బ్రెయిన్ వెకేషన్ కు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. బీచ్, పర్వత ప్రాంతాలు, హిమ శిఖరాలు, జన సంచారం లేని ప్రదేశాలు, రద్దీ నగరాలు అయినా సరే సానుకూల ఆలోచనలు ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. బ్రెయిన్ వెకేషన్ నిత్య జీవితానికి ఒక చిన్న పాజ్ బటన్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మనసులో నాటుకుపోయిన భయాందోళనలను తొలగిస్తారు. ఆపనమ్మకాలను పోగొట్టి, కొత్త దృక్కోణాలను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సంభాషణలు, కార్యకలాపాలు చేస్తారు. ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.

అనుభవాలను నేర్పించే వ్యక్తులతో పరిచయాలు..

బ్రెయిన్ వెకేషన్ కు వెళ్లేటప్పుడు విభిన్న రంగాలకు చెందిన, సరికొత్త ఆలోచనలు కలిగిన వాళ్లు పరిచయమవుతుంటారు. వయసులో కూడా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి వారితో మాట కలపడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ అనుభవం వ్యక్తిగత, వృత్తి గత జీవితానికి తోడ్పడుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల రోజువారి వాతావరణం మారడంతో సరికొత్త ఆలోచనలకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే కార్పొరేట్ ఉద్యోగులు, స్టార్టప్ అప్ కంపెనీ నిర్వాహకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు బ్రెయిన్ వెకేషన్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. బ్రెయిన్ వెకేషన్ లో భాగంగా అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదు. ఎలా జరిగితే అలా జరుగుతుంది అన్న భావనతో ముందుకు వెళ్లాలి. కొన్ని కార్యాలయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నప్పటికీ ఒత్తిడి కారణంగా వారంతా మాట్లాడుకోవడం కుదరదు. ఈ తరహా వ్యక్తులు బ్రెయిన్ వెకేషన్ కు వెళ్లి సరికొత్త స్నేహితులను కలుసుకునే ప్రయత్నం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ తరహా బ్రెయిన్ వెకేషన్ కు వెళ్లే వారిలో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులు, సరికొత్త దృశ్యాలు మనసును ఉత్తేజితం చేసి ఉత్సాహంగా పని చేసేందుకు కారణం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో బ్రెయిన్ వెకేషన్ కు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బ్రెయిన్ వెకేషన్ అంటే వేలాది రూపాయల ఖర్చు చేసి ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజువారీ చేసే పనులకు భిన్నంగా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఉండే అడవులు, అందమైన వాతావరణం ఉన్న ప్రదేశాలకు స్నేహితులతో కలిసి వెళ్లి ఆస్వాదించడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు. తద్వారా ఒత్తిడిలను అధిగమించి ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంది.