Tea And Coffee Health Effects: మానవ శరీరంలో అన్ని అవయవాలు ప్రధానంగా పనిచేస్తాయి. అయితే వీటిలో మెదడు కీలకంగా ఉంటుంది. మెదడు నుంచి వచ్చే సూచనలతో ఇతర అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు పనిచేసే మెదడు విశ్రాంతిని కూడా కోరుకుంటుంది. ఈ విశ్రాంతి ఒక మనిషి నిద్ర పోయినప్పుడు ఉంటుంది. కానీ చాలామంది మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. నాడీ వ్యవస్థలో అడెనోసిన్ (Adenosin) అనే రసాయనం మెదడుకు విశ్రాంతిని కలగజేస్తుంది. కానీ మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో అడేనోసిన్ ను నియంత్రిస్తున్నాం. దీంతో నిద్రలేమి సమస్యలు రావడంతో పాటు ఆ తర్వాత గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అసలు Adenosin రసాయనం ఎలా పనిచేస్తుంది? దీనిని మనం ఎలా నియంత్రిస్తున్నాం?
మానవ శరీరంలో అనేక రసాయనిక క్రియలు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా శరీరం శక్తిని ఉపయోగించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు మెదడు విశ్రాంతి కోరుకుంటుంది. ఇలాంటి సమయంలో Adenosin అనే రసాయనం విడుదల అవుతుంది. ఈ రసాయనం మెదడులో ఉండే రిసీవర్ వద్దకు వెళుతుంది. ఈ కలయిక జరగగానే మనిషికి మత్తు వచ్చి నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది సక్రమంగా ఉంటే మనిషికి గాఢ నిద్ర కూడా వస్తుంది. కానీ నేటి కాలంలో చాలామంది సరైన నిద్రపోవడం లేదు. ఒకవేళ నిద్రపోయినా కలత నిద్ర ఉంటూ.. పీడ కలలు వస్తున్నాయని చెబుతున్నారు. అందుకు కారణం మనం చేసే తప్పులే.
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అలాగే సాయంత్రం కూడా కాస్త ఎనర్జీ కోసం మరోసారి వీటిని తీసుకుంటారు. అయితే టీ లేదా కాఫీ తీసుకున్నప్పుడు శరీరం ఉత్సాహంగా ఉంటుంది. దీంతో సక్రమంగా పనులు చేయగలుగుతాం. కానీ కొందరు రోజంతా పదులకొద్దీ టి లు తాగుతూ ఉంటారు. సాధారణంగా మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అయితే మెదడు విశ్రాంతి కోరుకునే సమయంలోనే టీ లేదా కాఫీ తాగినప్పుడు Adenosin అనే రసాయనాన్ని కెఫిన్ అనే పదార్థం పక్కకు నెడుతుంది. అడినోసిన్ దాని రిసీవర్లోకి వెళ్లకపోవడం వల్ల నిద్ర తేలిపోతుంది. అయితే టీ, కాఫీ ఎక్కువగా తాగే వారిలో మరింత నిద్ర చెడిపోయి నిద్రలేమి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు ఇలాగే ఉండడం వల్ల వారికి నిద్ర దూరమై గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
అందువల్ల టీ లేదా కాఫీ తాగే వారు తమకు నిద్ర ఎందుకు రావడం లేదో ఒక్కసారి ఈ విషయం తెలుసుకోవాలి. అయితే ఈ పానీయాలకు ఎక్కువగా అలవాటు అయిన వారు వాటిని తీసుకోకపోతే తలనొప్పి వస్తుంది. కానీ సాధ్యమైనంతవరకు ఈ పానీయాలను తగ్గిస్తూ ఉండాలి. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చినా.. దీర్ఘకాలికంగా మాత్రం అనేక సమస్యలను తీసుకువస్తుంది. ముఖ్యంగా మెదడుకు విశ్రాంతి అవసరమైనప్పుడు నిద్రపోవడమే బెటర్. అలాకాకుండా నిద్ర చెడగొట్టుకోవడం వల్ల అనేక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటికైనా టీ కాఫీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.