
గడిచిన 8 నెలల నుంచి ప్రజలు కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలు వెలుగులోకి రావడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి వైరస్ వల్ల ముప్పు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా వైరస్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లతో బాధ పడే వాళ్లకు 60 శాతం కరోనా ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
లండన్ పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ల్యుకేమియా, బోన్ మ్యారో, బ్లడ్ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడే అవకాశం ఉందని తేలింది. బర్సింగ్ హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. 1,044 మంది క్యాన్సర్ రోగులపై మార్చి నెల 18 నుంచి మే నెల 8వ తేదీ వరకు పరిశోధనలు నిర్వహించి సాధారణ క్యాన్సర్ తో పోలిస్తే బ్లడ్, బోన్ మ్యారో, ల్యుకేమియా క్యాన్సర్ల బారిన పడిన వారికి వైరస్ ముప్పు ఎక్కువని చెప్పారు.
ఈ రోగులలో 319 మంది రోగులు అధ్యయనం చేస్తున్న సమయంలోనే వైరస్ బారిన పడి చికిత్సకు కోలుకోలేక మృతి చెందారని చెప్పారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వ్యక్తులలో ఒకరైన రాచెల్ కెర్ ఈ పరిశోధన ఫలితాల ద్వారా కరోనా బారిన పడ్డ కొన్ని రకాల క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని… టైర్డ్ రిస్క్ అసెస్‌మెంట్ టూల్ ను ఈ ఫలితాల సహాయంతో సృష్టించవచ్చని తెలిపారు.