Soaked Almonds Benefits: శరీర ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే డ్రైఫ్రూట్స్‌లో బాదం గింజలు కూడా ఉన్నాయి. వీటిని చిన్న పరిమాణంలో తీసుకున్నా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందిస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E,మ్యాగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే బాదం గింజలను పచ్చిగా కాకుండా నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా 30 రోజుల పాటు నానబెట్టిన బాదం గింజలను తినడం వల్ల ఏం జరుగుతుందంటే?
30 రోజుల పాటు నానబెట్టిన బాదం గింజలు తినడం ఒక చిన్న అలవాటే. కానీ ఇది ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. బాదం గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఇలా బాదం గింజలను తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. పొడి బాదం కంటే నానబెట్టిన బాదం తేలికగా జీర్ణమవుతుంది. నానబెట్టిన తర్వాత దాని తొక్క తీసి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. దీంతో కడుపు సమస్యలు తగ్గి, గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
మేధస్సు, జ్ఞాపకశక్తి పెరగడంలో కూడా బాదం గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉదయం ఖాళీ కడుపుతో బాదం తినాలని నిపుణులు సూచిస్తారు. దీర్ఘకాలంగా తింటే బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడి, ఫోకస్ పెరుగుతుంది. బరువు నియంత్రణలో కూడా బాదం సహాయపడుతుంది. ఇందులో ఉన్న మంచి కొవ్వులు, ఫైబర్ వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. దీంతో అనవసరంగా తినే అలవాటు తగ్గుతుంది. ఇది పరోక్షంగా ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
హృదయ ఆరోగ్యానికి కూడా బాదం చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా బాదం ఎంతో ఉపయోగకరం. విటమిన్ E అధికంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే జుట్టు బలంగా, మెరుస్తూ ఉండేందుకు సహాయపడుతుంది.
అయితే రోజుకు 4 నుంచి 6 బాదం గింజలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా తీసుకుంటే క్యాలరీలు ఎక్కువై బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా, 30 రోజుల పాటు నానబెట్టిన బాదం గింజలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అంది, మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.