
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల దేశంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా ఉద్యోగాలు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటంతో, కరోనా భయం వల్ల చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. ఏదైనా కావాలంటే కూడా ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. పార్కులు, జిమ్‌లు మూసి ఉండటంతో వ్యాయామంపై కూడా చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.
ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఊబకాయంతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరి కొందరు ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ల లోపంతో బాధ పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు చేసిన చేసిన అధ్యయనంలో శరీరానికి సరిపడా ఎండ తగలకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడి కావడం గమనార్హం.
శరీరానికి అవసరమైన విటమిన్ డి లభించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. విటమిన్ డి ఉత్పత్తికి కారణమైన అతినీల లోహిత కిరణాలు తగినంతగా శరీరానికి సోకకపోతే మలద్వార క్యాన్సర్ తో పాటు పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అతినీల లోహిత కిరణాల స్థాయిని, క్యాన్సర్ కేసులను బట్టి ఈ అధ్యయనం చేశారు.
45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. మనుషులకు సోకే యూవీబీ కిరణాల్లో హెచ్చుతగ్గుల వల్ల పెద్దపేగు-మలద్వారం క్యాన్సర్ నిష్పత్తిలో భారీగా తేడాలను గుర్తించామని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి కొరతను నివారించుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని చెప్పవచ్చు.