
కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ విద్యార్థుల విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం చూపాయి. విద్యార్థులు స్కూల్, కాలేజ్ కు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆన్ లైన్ లోనే తరగతులకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం, పది, ఇంటర్ పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ అవుతుండటంతో కొంతమంది విద్యార్థులలో పుస్తక పఠనంపై ఆసక్తి అంతకంతకూ తగ్గుతోంది.
ఒకప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చే విద్యార్థులు సైతం స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడి చదువులో వెనుకబడుతున్నారు. విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలగడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. విద్యార్థులకు తల్లిదండ్రులు చదువుకోవడానికి నిర్ణీత సమయం కేటాయించడంతో పాటు ఆ సమయంలో చదువు తప్ప మరో వ్యాపకం ఉండకుండా జాగ్రత్త పడాలి. విద్యార్థులు చదువుకునే సమయంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తే వాళ్లు ప్రశాంతంగా చదువుకోగలుగుతారు.
విద్యార్థులు గంటల తరబడి చదవకుండా మధ్యలో 5 లేదా 10 నిమిషాలు విరామం తీసుకుని చదువుకుంటే మంచిది. ప్రణాళిక ప్రకారం చదివితే సులభంగా సబ్జెక్ట్ లను పూర్తి చేయడం సాధ్యమవుతుంది. విద్యార్థులు అసైన్ మెంట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు చేయాల్సిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. పరీక్షల కోసం చదవకుండా అభిరుచికి తగిన విధంగా పుస్తకాలను ఎంచుకుని చదవాలి.
అనుకున్న పనిని విద్యార్థులు అనుకున్న విధంగా పూర్తి చేస్తే తల్లిదండ్రులు బహుమతులను ఇచ్చి ప్రోత్సహించాలి. ఏవైనా సందేహాలు ఉంటే టీచర్లు, స్నేహితుల ద్వారా నివృత్తి చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకుని పక్కా టైమ్ టేబుల్ ను ప్రిపేర్ చేసుకుంటే విద్యార్థులు శ్రద్ధగా, చురుకుగా చదివే అవకాశాలు ఉంటాయి.