Reasons behind Cancer: క్యాన్సర్ పై పరిశోధనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ప్రజలతో పరిశోధకులు పంచుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఒక అధ్యయనం కోట్లాది మంది నిద్రను దూరం చేసింది. అవును ఇప్పుడు మీరు ఇది చదివిన తర్వాత మేబీ మీరు కూడా నిద్రపోరు. ఎందుకంటే 2008 నుంచి 2017 మధ్య జన్మించిన 1.56 కోట్లకు పైగా ప్రజలు భవిష్యత్తులో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎక్కువ భాగం ఆసియా దేశాలలో ఉన్నాయట. పరిశోధన ప్రకారం, భారతదేశంలో ఈ కాలంలో జన్మించిన దాదాపు 16.5 లక్షల మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడవచ్చు. అయితే, దానిని నివారించడానికి చర్యలు తీసుకుంటే, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.
ఒక కొత్త అధ్యయనం ప్రకారం 76% కడుపు క్యాన్సర్ కేసులు హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి. ఇది కడుపులో నివసించే సాధారణ బ్యాక్టీరియా. కానీ అది ఎక్కువ కాలం ఉంటే, అది ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. తరువాత ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. మంచి విషయం ఏమిటంటే ఈ బ్యాక్టీరియాను చికిత్స ద్వారా నివారించవచ్చు. ప్రపంచ డేటా ప్రకారం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం ఉన్న 1.56 కోట్ల మందిలో, ఈ కేసుల్లో దాదాపు 60% ఆసియాలో మాత్రమే ఉంటాయని అంచనా.
భారతదేశం, చైనాలో మాత్రమే 65 లక్షల కొత్త కేసులు నమోదవుతాయని భావిస్తున్నారు. ఇది మన ఆరోగ్య విధానాలను మార్చుకోవాల్సిన తీవ్రమైన సూచనను అందిస్తుంది. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను కడుపు క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది కడుపు లోపలి పొరలోని కణాలలో సంభవించే ప్రాణాంతక క్యాన్సర్. ఇది సాధారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలను చూపించదు. ఆకలి లేకపోవడం, గుండెల్లో మంట, అజీర్ణం లేదా ఆకస్మిక బరువు తగ్గడం వంటి లక్షణాలు తరువాత కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా. అయితే, ధూమపానం, అధిక ఉప్పు ఆహారం, మద్యపానం, జన్యుపరమైన కారణాలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కూడా దాని ప్రమాద కారకాలు. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, ఈ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కాబట్టి ముందస్తుగా గుర్తించడం, నివారణ చాలా ముఖ్యం.
ప్రస్తుత పరిస్థితిలో ఎటువంటి మార్పులు చేయకపోతే, రాబోయే సంవత్సరాల్లో మరణాల రేటు, కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభమవుతుందని కొత్త పరిశోధన చెబుతోంది. ముఖ్యంగా యువతరం, వృద్ధాప్య జనాభాలో క్యాన్సర్ కేసుల పెరుగుదల ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ను నివారించడానికి, హెలికోబాక్టర్ పైలోరీ పెద్ద ఎత్తున స్క్రీనింగ్, చికిత్సపై దృష్టి పెట్టడం అవసరమని పరిశోధన నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ఈ చర్యలను తీవ్రంగా అమలు చేస్తే, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులను 75% వరకు తగ్గించవచ్చని అంచనా.
ఇటీవలి అధ్యయనం ప్రకారం, సబ్-సహారా ఆఫ్రికాలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అక్కడ పరిస్థితి మరింత దిగజారవచ్చు. 2022 కంటే అక్కడ ఆరు రెట్లు ఎక్కువ కేసులు ఉండవచ్చు. దీని అర్థం ప్రతి దేశం ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. తద్వారా భవిష్యత్ తరాలను ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షించవచ్చు. భారతదేశంలో కూడా ఈ క్యాన్సర్‌ను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌పై ఈ పరిశోధన నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.