ఇన్నాళ్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చిపోవడం.. దానికి టీఆర్ఎస్ శ్రేణులు మౌనంగా ఉండి లైట్ తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో జరిగింది. అనవసరంగా తెలంగాణ బీజేపీ నేతలను ప్రజల్లో హీరోలు చేయవద్దని గులాబీ అధిష్టానం మౌనంగా ఉంది. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు.. వరంగల్ లో ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ దాడి చేశాక ఇక టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఊపేక్షించడం లేదు. బీజేపీని టార్గెట్ చేసి కన్నుకు కన్ను.. తొడకు తొడ కొట్టేస్తున్నారు.
ప్రధానంగా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్న బీజేపీ నేతలకు.. అదే కేంద్రంలోని బీజేపీ హామీలిచ్చి మరీ ఎగ్గొట్టిన సంగతులను గుర్తు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాంచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లి కేటీఆర్ కు సవాల్ చేయగా.. అంతే ధీటుగా కేటీఆర్ ‘కేంద్రంలోని మోడీ సార్ తెస్తానన్న నల్లధనం.. ఇస్తానన్న జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు ఏవీ అంటూ ’ కడిగేశాడు.
ఇప్పుడు టార్గెట్ బండి సంజయ్ లక్ష్యంగా కేటీఆర్ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ మంజూరైనా కేంద్రంలోని బీజేపీ ఇవ్వని వైనాన్ని కేటీఆర్ ఎండగట్టారు. ఐటీఐఆర్ తేలేని బీజేపీ.. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ను మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమని ఆరోపించారు.
ఐటీఐఆర్ గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరగా ఉందని కేటీఆర్ విమర్శించారు. సొంత పార్టీ కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం అని ఆరోపించారు.
ఐటీఐఆర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ కు ఉందా? రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ స్పష్టమైన ప్రకటన చేయించాలని కేటీఆర్ సవాల్ చేశారు. సంజయ్ కు దమ్ముంటే కనీసం ఒక్క ప్రాజెక్టును హైదరాబాద్ కు తీసుకురాగలరా? మీడియాలో ప్రచారం కోసం అసత్యాలతో లేఖ రాస్తారా? అని కేటీఆర్ కడిగేశాడు. టీఆర్ఎస్ సర్కార్ పై మీ చేతగానితనాన్ని దాచి అబద్ధాలు వేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
దీన్ని బట్టి ఇక కేటీఆర్ రంగంలోకి దిగాక మిగతా నేతలు కూడా బీజేపీని టార్గెట్ చేయడం ఖాయమని.. గులాబీ దండులో వచ్చిన ఈ మార్పును అందరూ గమనించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.