Winter Bathing: ప్రస్తుతం చలి విజృంభిస్తోంది. ఉదయం 9 దాటితే గాని ఎవరూ బయటకు రావడం లేదు. కొంతమంది అయితే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే స్కూలుకు, కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు వెళ్లేవారు మాత్రం చలితో వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని చలితో సంబంధం ఉన్న పనులను చేయడం లేదు. వీటిలో భాగంగా కొందరు స్నానం చేయడానికి వెనుకాడుతున్నారు. చలికి స్నానం చేయకుండా అలాగే ఉద్యోగాలకు, వ్యాపార సముదాయాలకు వెళ్లేవారు ఉన్నారంటే ఆశ్చర్య పోరా అక్కర్లేదు. ఇంకొంతమంది అయితే రోజుల తరబడి స్నానం చేయకుండా అలాగే ఉంటున్నారు. వేసవికాలంలో కంటే చలికాలంలో చెమట తక్కువగానే ఉంటుంది. అయినా కూడా స్నానం చేయకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?
చలి కాలమే కదా.. స్నానం ఎందుకు చేయడం అన్న బద్ధకంతో ఉండేవారు చాలామంది ఉన్నారు. వీరు చలికి భయపడుతూ ఇంట్లో నుంచి బయటకు కూడా రారు. ఒకవేళ బయటకు వెళ్లినా కూడా ఎలాంటి చలి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చలికాలం పేరు చెప్పి స్నానం చేయకుండా ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చలికాలంలోనూ ప్రతిరోజు స్నానం తప్పనిసరిగా చేయాలని అంటున్నారు.
స్నానం చేయకపోవడం వల్ల చెమట అలాగే పేరుకు పోతుంది. దీంతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోజుల తరబడి స్నానం చేయకపోవడం వల్ల ఉత్సాహం తగ్గిపోతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కొన్ని రోజులపాటు స్నానం చేయకపోవడం వల్ల ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు. మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. స్నానం చేయకపోవడం వల్ల మానసికంగా అలసిపోయినట్లు కనిపించి బయట తిరగాలని అనిపించదు. అంతేకాకుండా శరీరం నుంచి దుర్వాసన రావడంతో ఇతరులు వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వీరిని దగ్గరికి కూడా రానివ్వకుండా చేస్తారు. చిన్నపిల్లలు నుంచి పెద్దవారు ఎవరైనా ప్రతిరోజు తప్పక సాయం చేయాలని వైద్యులు తెలుపుతున్నారు.
అయితే చలికాలంలో స్నానం చేయాలని ఇబ్బంది అనిపిస్తే దీనికి కొన్ని మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు చలికి ఇబ్బందులకు గురవుతే వారికి మధ్యాహ్న సమయంలో స్నానం చేయించాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కాస్త పెరగడంతో పాటు వాతావరణం వేడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నానం చేయవచ్చు. అలాగే వృద్ధుల విషయంలో కూడా ఇదే పాటించవచ్చు. అయితే స్కూలుకు, కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు వెళ్లేవారు మాత్రం ఉదయం తప్పనిసరిగా స్నానం చేయాల్సిందే. ఇప్పటివరకు చన్నీటి స్నానం చేసే అలవాటు ఉన్నవారు.. చలికాలం మొత్తంలో వేడినీటి స్నానం చేయవచ్చు. అయితే పూర్తిగా వేడివీ కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా స్నానం చేసిన వెంటనే ఎండలో కాసేపు కూర్చోవడం వల్ల చలి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకానీ చలికాలం మొత్తంలో స్నానం చేయకుండా ఉండడం ఏమాత్రం మంచిది కాదు అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.