Heart attack in bathroom: చిన్న , పెద్ద అని తేడా లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడంతో చాలామంది భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన శరీరం ఏ విధంగా స్పందిస్తుందో తెలియకుండా పోతుంది. అయితే గుండెపోటు రావడానికి అనేక కారణాలు చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా మితిమీరిన ఆహారం, సరైన వ్యాయామం లేకపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు సక్రమంగా పనిచేయకుండా ఉంటాయి. దీంతో రక్తప్రసరణ సక్రమంగా లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ శాతం ఉదయం బాత్రూంలోకి వెళ్లిన తర్వాత గుండెపోటు వస్తున్నట్లు కొన్ని వార్తలు చూస్తుంటాం. ఇప్పటివరకు బాత్రూంలోకి వెళ్లినవారు స్నానం చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ లేటెస్ట్ నివేదికల ప్రకారం మల, మూత్ర విసర్జన ద్వారా గుండెపోటు ఎక్కువగా వస్తుందని గుర్తించారు. అది ఎలా అంటే?
NCBI నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు ఎక్కువగా బాత్రూంలోనే జరిగినట్లు తెలిపింది. బాత్రూంలోకి వెళ్లిన తర్వాత తలపై స్నానం చేసిన వారు.. తలని ఎక్కువగా రుద్దుతూ ఉంటారు. దీంతో రక్తం వేడెక్కిపోతుంది. ఫలితంగా శరీరం ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా స్నానం చేసే సమయంలో అవయవాలన్నీ పనిచేస్తాయి. ఈ సమయంలో రక్త పంపింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
అయితే ఇటీవల నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. మల, మూత్ర విసర్జన చేసే సమయంలో వాల్సాల్వా మ్యాన్యువర్ అనే ప్రభావంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు నిరూపించారు. వాల్సాల్వా మ్యాన్యువర్ అనేది శ్వాసను నిలిపి, పొట్ట మీద ఒత్తిడి తేవడం వల్ల రక్తపోటు తగ్గి గుండె ధమనుల్లో రక్తప్రవాహం ఆగుతుంది. ఇలా చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రక్తం మెదడుకు చేరడం ఆగిపోతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్న వారిలో ఈ పరిస్థితి మరింత తీవ్రమై కుప్పకూలిపోతారు. మల, మూత్ర విసర్జన సమయంలో వాల్సాల్వా మ్యాన్యువర్ పై ఈ ప్రభావం పడుతుంది. అందువల్ల ఎక్కువగా బాత్రూంలో ఇలాంటి గుండెపోట్లు వస్తున్నాయని అంటున్నారు.
అయితే ఇప్పటివరకు కొంతమంది వైద్యులు స్నానం చేయడం వల్ల గుండెపోటు వస్తుందని చెప్పారు. కానీ ఇది నిరూపితం కాలేదని అంటున్నారు. అయితే మల, మూత్ర విసర్జన సమయంలో ఒత్తిడి అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారు వైద్యుల వద్ద సరైన సలహా తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు ఎక్కువగా బాత్రూంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. అలాగే గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువగా బాత్రూంలోకి వెళ్లాల్సి వస్తే వారిని ఇతరులు గమనించే ప్రయత్నం చేయాలి.