Bus accidents reasons: ఆర్థిక స్థిరత్వం ఉన్నవారు కార్లు కొనుగోలు చేస్తారు. సుదూర ప్రాంతాలలో ప్రయాణం చేయడానికి కార్ల మీదనే వెళుతుంటారు. మధ్యతరగతి, పేద వర్గాలకు చెందినవారు మాత్రం ఆర్టీసీ బస్సులోనే వెళ్తారు. నేటి కాలంలో కూడా పేదలకు, మధ్యతరగతి వారికి ఆర్టీసీ బస్సులు అనేది అత్యంత నమ్మకమైన ప్రయాణ సాధనాలుగా ఉన్నాయి. పైగా ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల చాలామంది మహిళలు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సుశిక్షితులైన డ్రైవర్లు నడుపుతారు. అందువల్లే చాలామంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. పైగా ఇటీవల కాలంలో ప్రైవేటు బస్సులలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చాలామంది ఆర్టీసీ బస్సులనే నమ్ముతున్నారు.
ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు సమర్థవంతంగానే తోలుతున్నప్పటికీ.. బిజీ రోడ్లమీద ఎదురుగా వచ్చే వాహనాల వల్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. సోమవారం మీర్జాగూడ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడానికి ప్రధాన కారణం కంకరలోడుతో వస్తున్న టిప్పర్. ఈ రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించబోయి కంకరలోడు టిప్పర్ డ్రైవర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. రెండు వాహనాలు కూడా విపరీతమైన వేగంతో ఉండడం.. టిప్పర్ బస్సును అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. టిప్పర్ ఢీ కొట్టిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సును తోలుతున్న డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు . బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు చనిపోయారు. టిప్పర్ డ్రైవర్ కూడా దుర్మరణం చెందడంతో.. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 20 కి చేరుకుంది..
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా బస్సులు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ, ప్రైవేట్ అని తేడా లేకుండా బస్సులు ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా గడచిన పది రోజుల్లో జరిగిన బస్సు ప్రమాదాలలో 60 మంది దుర్మరణం చెందారు.. ఇప్పుడు మీర్జాగూడ ప్రాంతంలో 20 మంది చనిపోవడంతో.. ఈ సంఖ్య 80 కి చేరుకుంది. ఆర్టీసీ బస్సులను పక్కన పెడితే.. ప్రవేట్ బస్సులను నడిపే డ్రైవర్లకు అంతగా అనుభవం ఉండడం లేదు. సరైన స్థాయిలో విశ్రాంతి ఉండడం లేదు. పైగా బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర కూడా సీట్లు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయిస్తున్నారు. ఒక డ్రైవర్ బస్సు తోలుతుంటే.. సెకండ్ డ్రైవర్ కు కనీసం విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండడం లేదు. ఎందుకంటే సెకండ్ డ్రైవర్ పడుకునే ప్రాంతాన్ని కూడా సీటుగా మార్చి టికెట్ విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో కర్నూల్ టేకురు వద్ద జరిగిన ప్రమాదంలో.. సెకండ్ డ్రైవర్ ఏ మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. పైగా వేగంగా వెళ్లాలని తాపత్రయంలో రోడ్డు మీద పడి ఉన్న బైక్ ని కూడా అతడు గుర్తించలేదు. దీంతో బస్సులో మంటలు ఏర్పడి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలకు దిగకపోతే.. ఇటువంటి దారుణాలు మరిన్ని చోటు చేసుకుంటాయి.