That road is very dangerous: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది దాకా చనిపోయారు. వాస్తవానికి ఈ రోడ్డు మీద జరిగిన ప్రమాదం కొత్తదేమి కాదు. ఎందుకంటే ఈ రోడ్డు అత్యంత డేంజర్. ఆ జిల్లాలోనే కాదు.. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారిగా ఇది పేరుపొందింది. ఈ రోడ్డు మీద జరిగిన ప్రమాదాలలో 200 మంది దుర్మరణం చెందారు. 600 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి ఈ రోడ్డు ఇలా ఎందుకు మారిందంటే..
జాతీయ రహదారి 163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మించాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది . అయితే ఈ రోడ్డుకు రెండు వైపులా కూడా చెట్లు విపరీతంగా ఉన్నాయి. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఇవ్వడం లేదు. అందువల్లే ఈ రోడ్డు నిర్మాణానికి అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్, బీజాపూర్ జాతీయ రహదారి 163(ఇది చేవెళ్ల వికారాబాద్ తాండూరు రూట్) పై గడచిన ఐదు సంవత్సరాల కాలంలో విపరీతమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ రోడ్లు అత్యంత ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు షార్ప్ బెండ్స్ ప్రమాదకరంగా ఉంటాయి. ఈ రోడ్డు మీద ఓవర్ లోడ్ టిప్పర్లు నిత్యం వెళ్తూనే ఉంటాయి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ప్రతినెల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సోమవారం నాటి రోడ్డు ప్రమాదానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక గత ఏడాది డిసెంబర్ 2న ఆలూరు గేటు వద్ద ఓ లారీ కూరగాయల విక్రయిస్తున్న వ్యాపారుల మీదకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చూస్తుండగానే చనిపోయారు. పదిమంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. అంతకంటే ముందు రోజు ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మీర్జాగూడ గేటు దగ్గర ఒక కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు.
ఇదే ఏడాది ఆగస్టు 26న చేవెళ్ల బస్సు స్టాండ్ దగ్గర సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం చెందారు. పరిగి, రంగాపూర్ రహదారిలో ఆగి ఉన్న లారీని పెళ్లి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక సోమవారం జరిగిన ప్రమాదంలో 20 మంది స్పాట్ లోనే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన అనేక ప్రమాదాలలో 200 మంది చనిపోయారు. దాదాపు 600 మంది గాయపడ్డారు. గాయపడిన వారు మొత్తం దివ్యాంగులుగా మారిపోయారు.
ఈ రోడ్డు మొత్తం సింగల్ లైన్ లోనే ఉంటుంది. దీనిని నాలుగు వరుసలుగా నిర్మించాలని 2021 లోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. ఈ రోడ్డు నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. అయితే ఇక్కడి రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్ధాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు పనులకు అడ్డంకులు సృష్టించారు. ఫలితంగా ఈ రోడ్డు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లే సోమవారం రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లతోపాటు పదిమంది పురుషులు.. 9 మంది మహిళలు ఉన్నారు. అందులో ఒక చిన్నారి కూడా ఉండడం అత్యంత విషాదం.