మనలో చాలామంది సహజంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలలో నోటిపూత కూడా ఒకటి. ఎక్కువగా ఒత్తిడికి గురైనా, శరీరంలో వేడి ఎక్కువైనా, నీళ్లు ఎక్కువగా తీసుకోకపోయినా నోటిపూత సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది. నోటిపూత వల్ల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. నాలుక, పెదవులపై ఎర్రగా, తెల్ల మచ్చల్లాగా ఏర్పడితే నోటిపూతగా గుర్తించాలి. నోటిపూత వల్ల కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
తేనెతో నోటిపూత సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. తేనెలో ఉండే మైక్రోబయల్ గుణాలు తక్కువ సమయంలో నోటిపూతను తగ్గిస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం లేదా పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా నోటిపూత సమస్యకు చెక్ పెట్టవచ్చు. పాలపదార్థాలు కూడా నోటిపూత సమస్యను సులువుగా తగ్గిస్తాయి. మజ్జిగ తీసుకోవడం, సమస్య ఉన్న చోట నెయ్యి రాయడం ద్వారా సులభంగా సమస్య తగ్గుతుంది.
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆకులు కూడా నోటిపూతకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. నోటిలో తులసి ఆకులను నీళ్లతో కలిపి నమిలితే నోటిపూత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.. నొప్పి ఉన్న చోట ఐస్ ముక్కను ఉంచడం ద్వారా కూడా సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చల్లటి నోటితో నోరు శుభ్రపరచుకున్నా, నోటిపూత ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో రుద్దినా మంచి ఫలితాలు ఉంటాయి.
నోటిపూత ఉన్నచోట లవంగం నూనె రాయడం, లవంగం నమలడం ద్వారా కూడా నోటిపూత సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. నోటిపూతతో బాధ పడేవాళ్లు నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్నా సమస్య తగ్గకపోతే వైద్య నిపుణులను సంప్రదించాలి.