Health Tips: సాధారణంగా తుమ్ములంటే జనాలకు చాలా నమ్మకాలు ఉంటాయి. పని మీద బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా తుమ్మితే పని అవదని భావించడమే కాకుండా బయటకు వెళ్లే ఆలోచనను సైతం విరమించుకుంటారు. అలాగే గడప మీద తుమ్మితే అశుభం అని, తినే సమయంలో తుమ్మితే చేయి కడుగుకోవాలని ఇలా కొన్ని నమ్మకాలను ఫాలో అవుతుంటారు. అందుకే ఆయా సమయాల్లో తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపేసుకుంటూ ఉంటారు.
సభలు, సమావేశాలు, సినిమా హళ్లు, క్లాస్ రూమ్ లే కాకుండా నలుగురు ఉన్న ప్రాంతాల్లో తుమ్మాలంటే ఆలోచిస్తారు. పక్కవాళ్లు ఏమనుకుంటారోనని తుమ్ములను బలవంతంగా తుమ్మును ఆపుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ విధంగా తుమ్మును బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
తుమ్ము అనేది అసంకల్పిత ప్రతీకార చర్యని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే కొన్ని కొన్ని సమయాల్లో అనుకోకుండా తుమ్ములు వస్తుంటాయి. ఏదైనా బాక్టీరియా ముక్కు, గొంతులోకి వెళ్లినప్పుడు, దుమ్ము చేరినప్పుడు దాన్ని బయటకు పంపేందుకు శరీరం చేసే క్రియనే తుమ్మని చెప్పొచ్చు. అయితే దీన్ని ఆపడం మంచిది కాదని నిపుణులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తికి తుమ్ము రావడంతో దాన్ని ఆపేందుకు ప్రయత్నించారట. ఈ మేరకు ఆ వ్యక్తి ముక్కు మూసుకోగా లోపల గాలి ఒత్తిడికి గురై శ్వాసనాళ్లాన్ని చించేసిందట. ఈ ఘటన బలవంతంగా ఆపడం వలన జరగగా… తుమ్ము ఆపిన సమయంలో సాధారణం కంటే ఇరవై రెట్లు బలంగా మారుతుందని డాక్టర్స్ తెలిపారు.
అలాగే తుమ్ము ఆపడానికి ప్రయత్నిస్తే బ్యాక్టీరియా, దుమ్ము ముక్కులోనే ఉండిపోతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా తుమ్మును ఆపడం వలన ముక్కు మార్గంతో పాటు చెవులు, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకానొక సమయంలో ఈ ఒత్తిడి కారణంగా కర్ణభేరి పగలిపోవడం, కళ్లల్లోని చిన్న రక్తనాళాలు వంటివి పగిలిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే అసంకల్పితంగా వచ్చే తుమ్మును ఎవరూ ఆపుకోవద్దని వైద్యులు తెలిపారు.