Health Insurance: ఆరోగ్య బీమాకు సంబంధించి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) కీలక మార్పులు చేసింది. పాలసీ కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని తొలగించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చింది.
గతంలో ఇలా..
ఇంతకు ముందు ఆరోగ్య బీమా కొనుగోలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లుగా ఉండేది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా కొనుగోలు చేయవచ్చు. ఇక అన్ని వయసుల వారికీ బీమా సంస్థలు పాలసీ జారీ చేయవచ్చు.
అందరూ అర్హులే..
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఇకపై అందరూ అర్హులే అని ఐఆర్‌డీఏఐ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతోపాటు కాంపిటెం అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికీ అనుగుణంగా బీమా సంస్థలు తమ ప్రొడక్టులను డిజైన్ చేయవచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సొంరక్షణ అందించడంతోపాటు కంపెనీలు తమ ఉత్పత్తులను వివిధీకరించుకోవడానికి వీలు పడుతుందని తెలిపింది.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పాలసీ..
ఐఆర్‌డీఏఐ తాజా సవరణల నేపథ్యంలో బీమా సంస్థలు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈమేరకు ఐఆర్‌డీఏఐ సూచనలు కూడా చేసింది. అదే సమయంలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ఛానెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఐఆర్‌ఈఏఐ జాబితా నిర్ణయాన్ని పరిశ్రమల వర్గాలు స్వాగతిస్తున్నాయి.
కీలక మార్పులు..
మరోవైపు ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ కొన్ని కీలక మార్పులు సైతం చేసింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. ఇంతకుముందు నాలుగేళ్లగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను ఇప్పుడు 3 ఏళ్లకు కుదించింది. ఈ నిబంధనతో మూడేళ్ల నిరంతర ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే ముందస్తు వ్యాధులకు కారణంగా చూపి క్లెయిమ్‌లను బీమా సంస్థలు తిరస్కరించడానికి వీలు ఉండదు. మారటోరియం వ్యవధిని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు కుదించింది.