Green Tea or Black Tea: ప్రస్తుత రోజుల్లో బరువు ప్రధాన సమస్యగా మారింది. దీంతో చాలా మంది బరువు తగ్గాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా కొన్ని ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. వీటిలో ముఖ్యంగా బ్లాక్ టీ, గ్రీన్ టీని తీసుకునే వారి సంఖ్య ఎక్కువే. అయితే రెండింటిలో ఏది మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ రెండు టీలు కూడా ఆరోగ్యానికి ఉపయోగకరమైనవే అయినప్పటికీ, వాటి పని తీరు, శరీరంపై ప్రభావం కొంత భిన్నంగా ఉంటుంది. మరి వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే?
గ్రీన్ టీని సాధారణంగా బరువు తగ్గడానికి ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. దీనిలో ఉండే క్యాటెకిన్స్, ముఖ్యంగా EGCG అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో మెటాబాలిజాన్ని వేగంగా పనిచేయేలా చేస్తుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడుతుంది. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో క్యాలరీలు కొంత ఎక్కువగా ఖర్చవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే డైట్ ఫాలో అయ్యేవారు ఎక్కువగా గ్రీన్ టీని ఎంచుకుంటారు.
గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల రోజులో 2 నుంచి 3 కప్పులు తాగినా చాలా మందికి ఇబ్బంది ఉండదు. ఇది శరీరాన్ని తేలికగా ఉంచడంలో, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. కొంతమందికి గ్రీన్ టీ తాగిన తర్వాత ఫ్రెష్‌గా అనిపించడం ఇందుకే. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగితే అసిడిటీ లేదా వికారం వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక బ్లాక్ టీ కూడా తక్కువేమీ కాదు. బ్లాక్ టీ పూర్తిగా ఆక్సిడైజ్ చేసిన టీ ఆకులతో తయారవుతుంది. ఇందులో ఉండే పాలీఫినాల్స్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్లాక్ టీ గట్ హెల్త్‌ను మెరుగుపరచడం ద్వారా పరోక్షంగా బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే ఇది ఆకలిని కొంతవరకు నియంత్రించడంలో ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా పాలు, చక్కెర లేకుండా తీసుకుంటే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
బ్లాక్ టీలో గ్రీన్ టీతో పోలిస్తే కెఫిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తాగినప్పుడు ఎనర్జీ ఎక్కువగా వచ్చిన భావన కలుగుతుంది. ఉదయం సమయంలో బ్లాక్ టీ తాగడం వల్ల మైండ్ అలర్ట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. అయితే అధికంగా తాగితే నిద్రలేమి, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
బరువు తగ్గాలంటే కేవలం టీ తాగడం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఒక్కటే మాయలాగా కొవ్వు కరిగించవు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి తీసుకుంటే బరువు నియంత్రణకు మద్దతుగా పనిచేస్తాయి.
మధుమేహం లేదా హైబీపీ ఉన్నవారు చక్కెర లేకుండా టీ తీసుకోవడం మంచిది. పాలు ఎక్కువగా కలిపితే టీ ప్రయోజనాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రెడీమేడ్ ఫ్లేవర్డ్ టీలు లేదా అధిక చక్కెర ఉన్న టీ డ్రింక్స్ బరువు తగ్గడంలో ఉపయోగపడకపోవచ్చు.
