Life Expectancy: మారుతున్న జీవన శైలి, ఉరుకులు పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులు, టెక్నాలజీ ఇవన్నీ మనిషి జీవితంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. దీంతో అనేక వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వయసుతో, స్త్రీ, పురుష భేదం లేకుండా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే వైద్య రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక వైద్య చికిత్సలు చాలా రోగాలకు చికిత్స కూడా అందిస్తున్నాయి. దీంతో మనిషి సగటు ఆయుర్ధాయం పెరుగుతోంది. అయితే చాలా రోగాలకు చికిత్స అందిస్తున్నారు కానీ, పూర్తిగా నయం చేయడం లేదు. దీంతో మనిషి ఆయుర్ధాయం పెరిగినా ఎక్కువ కాలం రోగాలతోనే బ్రతకాల్సి వస్తోంది.
అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం..
తాజాగా ఇటీవల ఓ అంతర్జాతీయ అధ్యయనం ఫలితాలు ప్రకటించింది. మనిషి సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం ప్రకటించింది. 2022 నుంచి 2050 మధ్య కాలంలో పురుషుల ఆయర్ధాయం 4.9 సంవత్సరాలు, మహిళల ఆయుర్ధాయం 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తెలిపింది.
అమెరికా యూనివర్సిటీ అధ్యయనం..
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్‌టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ ఎవాల్యుయేషన్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. వాటి వివరాలను లాన్‌సెట్ జర్నల్‌లో ప్రచురించారు. మనషి సగటు జీవిత కాలం 5 ఏళ్ల వరకు పెరుగుతుంది కానీ, వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని తెలిపింది. గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువ ప్రభావం చూపుతాయని పేర్కొంది. స్థూలకాయం, అధిక రక్తపోటు ఎక్కువగా వేదిస్తాయని వెల్లడించింది.
ఆరోగ్యకరమైన జీవన శైలితో..
మారిన జీవనశైలే వ్యాధులకు కారణమని అధ్యయనం తెలిపింది. వ్యాధులకు దూరంగా ఉంటూ దీర్ఘాయుష్సుతో జీవనం గడపాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని కూడా సూచించింది. ఆరోగ్య కరమైన జీవశైలిని అలవర్చుకోవాలని తెలిపింది. ఆయుర్ధాయం స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుందని వెల్లడించింది.