winter : శీతాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో సమస్యలు వస్తాయి. శరీరం లోపల నుంచే కాకుండా.. శరీరం బయట కూడా మార్పులు సంభవించడం కామన్. పొడి చర్మం, పొడి జుట్టు, పాదాల్లో పగుళ్లు, దగ్గు, జలుబు, జ్వరం ఇలా చాలా సమస్యలు సతమతం చేస్తుంటాయి. మరికొందరిలో కఫం మరింత ఎక్కువ అవుతుంది.
ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు.. మీ కోసం కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం. మరి తెలుసుకొని పాటించేసేయండి. పొడి జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? గుడ్డులోని పచ్చ సొన, ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే పొడి జుట్టు బాగా తగ్గుతుంది.
పొడి చర్మం సమస్య వేధిస్తుందా? అయితే ఒక గిన్నెలో కొద్దిగా టమాటా రసం, పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసిన జుట్టుకు రాయండి. ఆరిన తర్వాత కడిగేస్తే.. పొడి చర్మం తగ్గుతుంది. కాకర రసం, కలబంద గుజ్జు కలిపి రాత్రంతా ముఖానికి పట్టించాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా? అయితే కొద్దిగా వంట నూనెలో పసుపు కలిపి మిక్స్ చేసి ఆ తర్వాత పాదాలకు పెట్టండి. ఇలా రోజూ చేస్తే.. త్వరగా మీ పాదాలు నయం అవుతాయి. అలాగే అరటి పండు గుజ్జును పాదాలకు పట్టించి.. ఓ పది నిమిషాల తర్వాత కడిగేయండి. మంచి మృదువు పాదాలు మీ సొంతం.
జలుబు, దగ్గు వేధిస్తున్నాయా? పసుపు పాలను రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే దగ్గు జలుబు కంట్రోల్ అవుతాయి. అలాగే ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోండి. గోరు వెచ్చటి పసుపు నీళ్లను గొంతులో పోసుకొని పుక్కిలించాలి. వెంటనే దగ్గు తగ్గుతుంది.
వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇంకా నాణ్యత గల స్లిపర్స్, షూస్ వాడటం మంచిది. దీని వల్ల పగుళ్లు దరిచేరవు. ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాయాలి. ఇలా చేస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు. రాత్రి నిద్రకు పోయే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోతుంది.