Health news : ప్రస్తుతం చాలా వ్యాధులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వయసు మీద పడిన తర్వాత రావాల్సిన వ్యాధులు కూడా చిన్న వయసులోనే వస్తున్నాయి. చిన్నపిల్లలకే కండ్లు కనిపించకపోవడం, కాళ్ల నొప్పులు రావడం వంటివి తరచూ చూస్తున్నాం. ఇది పక్కన పెడితే.. బస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదంటే ఎక్కువ సేపు ఒకే ప్లేస్ లో కూడా కూర్చున్నప్పుడు కాళ్లు, మడమ వంటివి వాస్తుంటాయి. అంటే ఒక్కోసారి ఉన్నట్లుండి పాదాలు, మోకాళ్లలో వాపు వస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలా మంది భయపడుతుంటారు. శరీరంలో ఆకస్మిక వాపు, నొప్పిని ఎడెమా అని పిలుస్తారు. అయితే పాదాలు, మోకాలు, చీలమండలలో వాపు రావడమే ఈ ఎడెమా. కేవలం ఈ శరీర భాగాల్లో మాత్రమే కాదు కొన్నిసార్లు ముఖం మీద కూడా కనిపిస్తుంది. ఈ సమస్య గర్భిణీలు, వృద్ధులలో ఎక్కువగా కనిపించినా ప్రస్తుతం నేటి ఆధునిక జీవితంలో కూడా ఈ సమస్య మరింత ఎక్కువ కనిపిస్తుంది.
ఎడెమా సమస్యకు కారణం ఏంటి?
కణజాలంలో అదనపు ద్రవం పేరుకుపోయినప్పుడు ఈ సమస్య ఏ వ్యక్తిలోనైనా సంభవించవచ్చు. ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా వేసవిలో కనిపిస్తుంది. అంతేకాదు మీ వంటల్లో లేదా డైలీ లైఫ్ లో ఎక్కువ ఉప్పు తీసుకోవడం, మందుల దుష్ప్రభావాలు ఎడెమా సమస్యలను కలిగిస్తాయి.
ఎడెమా సమస్యను ఎలా నిర్ధారిస్తారు..?
స్పష్టమైన కారణం లేకుండా వాపును అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంట్లో ఉపశమనం పొందాలంటే, ఉబ్బిన ప్రదేశంలో 15 సెకన్ల పాటు నొక్కాలి. అయితే ఇలా చేస్తున్నప్పుడు మీకు వెంటనే ఎముక కనిపిస్తే, వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లడం మంచిది. దీని తరువాత కొన్ని పరీక్షలు చేయించుకుంటే ఎడెమా ఉందా లేదా అని డాక్టర్ తనిఖీ చేస్తారు. కొందరికి కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి ఉంటుంది. ఇలాంటి వ్యాధులతో బాధపడేవారిలో ఎడెమాను పూర్తిగా నిరోధించడం కష్టమే అంటున్నారు నిపుణులు. అయితే, అధిక ఉప్పు తీసుకోవడం వలన మాత్రమే ఈ సమస్య కనిపిస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవాలి. క్రమంగా ఈ సమస్యను తగ్గిస్తుంది. ఎడెమా సమస్యతో బాధపడేవారికి, వైద్యులు మూత్రవిసర్జన ఔషధం తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇవి మూత్ర నాళం నుంచి ద్రవం, ఉప్పును బయటకు పంపిస్తాయి. ఈ ఔషధాన్ని నీటి మాత్రలు అని కూడా అంటారు. అయితే వైద్యుల సలహా చాలా అవసరం అని మాత్రం గుర్తు పెట్టుకోండి.
ఎడెమా సమస్యను నివారించడం ఎలా..?
ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా సరే మీరు కాళ్లతో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఎడెమా సమస్య ఉన్నవారు మేజోళ్ళు (కట్టు) ఉపయోగించవచ్చు. ఇది ఎడెమా సమస్య నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవద్దు లేదా నిలబడవద్దు. ఇది ఎడెమా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. డాక్టర్ సూచించిన మందులను తీసుకోవడం, వారి సలహాలు సూచనలు అనుకరిస్తుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..