Benefits of Kesar Water: మన దేశంలో వంటల్లో కుంకుమపువ్వును విరివిగా వినియోగించడం జరుగుతుంది. కుంకుమపువ్వు కలిగిన పాలు తాగాలని పెద్దలు గర్భిణులకు సూచిస్తారు. ఈ పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారని చాలామంది నమ్ముతారు. రంగు, రుచి, వాసన ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యాలలో కుంకుమ పువ్వు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఎర్ర బంగారంగా పిలిచే కుంకుమ పువ్వును మన దేశంలో కశ్మీర్ లో మాత్రమే పండిస్తారు.
కుంకుమ పువ్వులో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఔషధ గుణాలు ఉన్నాయి. కుంకుమపువ్వు నీళ్లు చర్మానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో పాటు శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు నీళ్లు ఫ్రీ రాడికల్స్ ను నివారించి చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతాయి.
మొటిమలు, మచ్చలకు మందులా పని చేయడంలో కుంకుమ పువ్వు నీళ్లు తోడ్పడతాయి. కుంకుమ పువ్వులో ఉండే ఫైటో కెమికల్స్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఆయుర్వేదంలో సైతం కుంకుమ పువ్వును ఎక్కువగా వినియోగిస్తారు. రుతు స్రావం సమయంలో మహిళలు కుంకుమపువ్వు నీళ్లను తాగడం వల్ల ఆ సమస్య నుంచు సులువుగా బయటపడవచ్చు. కుంకుమపువ్వు నీళ్లు అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి.
కుంకుమ పువ్వు నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి లేకుండా చురుకుగా పని చేయడం సాధ్యమవుతుంది. పడుకునే ముందు పాలలో చిటికెడు కుంకుమ పువ్వును వేసుకుని తాగితే హాయిగా నిద్ర పట్టడంతో పాటు డిప్రెషన్ లాంటి సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కుంకుమ పువ్వు పోగులను పది నిమిషాలు నీటిలో నానబెట్టి రోజూ పరగడుపున తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.