మన దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ సామాన్య ప్రజలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. షుగర్, గుండెజబ్బులతో బాధ పడేవాళ్లు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు దేశంలో షుగర్, గుండెజబ్బులతో బాధ పడే వాళ్ల సంఖ్య సంవత్సం సంవత్సరానికి పెరుగుతోంది. అధిక బరువుతో ఉన్నవాళ్లు, ఊబకాయులు ఈ సమస్యతో ఎక్కువగా బాధ పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా షుగర్, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చు.
ఎవరైతే రోజూ ఉదయాన్నే త్వరగా లేచి ఇంటి పనులు, వ్యాయామం ఎక్కువగా చేస్తారో వాళ్లు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ఆలస్యంగా నిద్రలేచే ఊబకాయులను మాత్రం ఈ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. రోజువారీ అలవాట్లను, జీవనశైలిని మార్చుకుంటే షుగర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఉదయం వ్యాయామం చేస్తే మరింత ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మన జీవ గడియారం సూర్యగమనంపై ఆధారపడి పని చేస్తుందని మెదడులో ఉన్న పీయూష గ్రంథి దీనిని నియంత్రిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ఎండ, కంటికి సహజ కాంతి తీసుకునేలా జాగ్రత్త పడితే జీవ గడియారం బాగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా పని చేసే వాళ్లు అప్పుడప్పుడూ బయటకు వెళ్లడం, సాయంత్రం సమయంలో డిజిటల్ స్క్రీన్ లకు దూరంగా ఉండటం వల్ల జీవ గడియారం పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది.