Gas Save Tips: దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంది. వాణిజ్య అవసరాల కొరకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 2003 రూపాయలుగా ఉంది. ఈ సిలిండర్ సాధారణ గ్యాస్ సిలిండర్ తో పోల్చి చూస్తే ఐదు కిలోల ఎక్కువ బరువు ఉంటుందనే సంగతి తెలిసిందే.
భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా గ్యాస్ ఆదా చేయవచ్చు. గ్యాస్ మంట రంగు ఎప్పుడూ బ్లూ కలర్ లోనే ఉండాలి. అలా కాకుండా ఇతర రంగుల్లో ఉంటే గ్యాస్ మంట వచ్చే చోట చెత్త చిక్కుకుపోయి ఉండవచ్చు. గ్యాస్ మంట రంగు మారితే వెంటనే శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా గ్యాస్ మంటను తక్కువగానే ఉంచితే మంచిది. గ్యాస్ మంటను తక్కువగా ఉంచడం వల్ల కూడా గ్యాస్ ఆదా చేయవచ్చు. పాడైపోయిన లేదా కాలిన పాత్రలలో వంట వండటానికి ఆలస్యమవుతుంది. వంట కోసం వినియోగించే గిన్నెలను శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్యాస్ పైప్ లను తనిఖీ చేస్తూ గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్త పడాలి.
థర్మోస్‌లో మరిగించిన నీటిని, టీని ఉంచడం ద్వారా మళ్లీ వేడి చేయడాన్ని సులువుగా నివారించవచ్చు. ప్రెషర్ కుక్కర్ లో వంట చేయడం ద్వారా కూడా గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసే సమయంలో పాత్రపై మూత పెడితే కూడా గ్యాస్ ఆదా అవుతుంది. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులను వేడి చేయాల్సి వస్తే కొంత సమయం సాధారణ వాతావరణంలో ఉంచి ఆ తర్వాత వేడి చేస్తే మంచిదని చెప్పవచ్చు.
వంటకు అవసరమైన పదార్థాలను ఒకేచోట ఉంచి వంట చేస్తే తక్కువ సమయంలోనే వంట చేయడం సాధ్యమవుతుంది. తడి పాత్రలను స్టవ్ పై పెట్టకుండా తుడిచిన పాత్రలను స్టవ్ పై పెడితే గ్యాస్ ను ఆదా చేయడం సాధ్యమవుతుంది.