కంటికి కనిపించని కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను ఈ మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. పలు దేశాల్లో వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని అధికారులు భావిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం నుంచి లాక్ డౌన్ అమలు కానుండగా డిసెంబర్ 2వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రులతో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి కఠినమైన ఆంక్షలను అమలు చేసే విషయమై చర్చలు జరిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
యూకేలో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కాగా బ్రిటన్ లో నిన్న ఒక్కరోజే 22,000 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్ 25వ తేదీన జరిగే క్రిస్ మస్ పండుగ నాటికి ఆంక్షలను సడలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇతర దేశాల్లో కూడా అధికారులు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ లో కూడా రెండోసారి లాక్ డౌన్ అమలవుతోంది.
భారత్ లో మాత్రం రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 50,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో భారత్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు, అధికారులు భావిస్తున్నారు.