Black Diamond Apple : ఆపిల్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉన్నాయి.. అందుకే రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదంటున్నారు పెద్దలు. అది నిజం కూడా యాపిల్ తినడం వల్ల మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఈ పండును సంపూర్ణ పోషకాహారంగా చెప్పవచ్చు. రక్తహీనతతో బాధపడే పిల్లలు, మహిళలు ప్రతిరోజూ యాపిల్ పండును తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్త ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తహీనత వల్ల నీరసం, విపరీతమైన అలసట వస్తుంది. ఆపిల్ వాటన్నింటి నుండి బయటపడేస్తుంది. ఆపిల్స్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి. రోజుకో ఆపిల్ పండు తినడం వల్ల రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మన దేశంలో కాశ్మీర్ లో ఆపిల్ సీజన్ నడుస్తోంది. కాశ్మీర్‌కు చెందిన ఆపిల్స్‌తో పండ్ల మార్కెట్ నిండిపోయింది నాణ్యమైన కాశ్మీరీ యాపిల్‌ను కొనుగోలు చేయాలంటే కిలోకు దాదాపు రూ. 120చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఒక స్పెషల్ యాపిల్ ఖరీదు 5 కిలోల కాశ్మీరీ యాపిల్‌తో సమానం. ఆ యాపిల్ పేరే బ్లాక్ డైమండ్ యాపిల్. ఈ యాపిల్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా సెలక్టివ్ ప్రదేశాలలో మాత్రమే పండిస్తారు. అంతేకాకుండా, ఇది ఇతర ఆపిల్స్ లాగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
బ్లాక్ డైమండ్ యాపిల్ ఎక్కడ దొరుకుతుంది ?
బ్లాక్ డైమండ్ యాపిల్ చాలా అరుదు. వీటిని ప్రతి చోటా సాగు చేయరు. ఈ ఆపిల్ సాగు చేయాలంటే చల్లని, పర్వత ప్రాంతం అవసరం. బ్లాక్ డైమండ్ యాపిల్ టిబెట్ , భూటాన్ వంటి పర్వత ప్రాంతాలలో మాత్రమే పండిస్తారు. అలాగే, పరిమిత ఉత్పత్తి కారణంగా బ్లాక్ డైమండ్ ఆపిల్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.
బ్లాక్ డైమండ్ ఆపిల్ ధర
సాధారణంగా కాశ్మీరీ యాపిల్‌ను పండించే సమయంలో కిలో రూ.120 నుంచి 150 వరకు విక్రయిస్తారు. కాగా బ్లాక్ డైమండ్ యాపిల్ ఒక్క ముక్క ధర దాదాపు రూ.500. ఇది ఖరీదైనది కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఆపిల్ చెట్టు కాయలు కాయాలంటే దాదాపు 8 సంవత్సరాలు పడుతుంది. సాధారణ ఆపిల్ చెట్లు 5 సంవత్సరాలలో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. బ్లాక్ డైమండ్ యాపిల్ చెట్టులోని ఆపిల్‌లలో 30 శాతం మాత్రమే నల్లగా ఉంటాయి.
బ్లాక్ డైమండ్ యాపిల్ తినడం సురక్షితమేనా?
బ్లాక్ డైమండ్ యాపిల్ రంగు నలుపు. దీని కారణంగా ఈ యాపిల్ తినడానికి ప్రయోజనకరంగా ఉండదని చాలా మంది సందేహ పడుతున్నారు. కానీ అది అలా కాదు. బ్లాక్ డైమండ్ యాపిల్ రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్ లాగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.