Night sweats during winter: చలికాలంలో బయటకు రావాలంటే భయం వేస్తుంది. ఎముకల కొరకే చలి ఉండడంతో కొందరు గదికే పరిమితం అవుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి విజృంభిస్తుండడంతో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే చలికాలంలో సాధారణంగా ఎవరికి చెమట వచ్చే అవకాశం ఉండదు. కానీ కొందరికి రాత్రి సమయంలో తీవ్రమైన చెమట వస్తుంది. ఒకవైపు ఎముకల కొరకే చలి ఉన్నా మరోవైపు చెమటలతో తడిసిపోతుంటారు. ఇలా జరిగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే?
చలి వేయగానే ఎవరైనా స్వెటర్ వేసుకుంటారు.. లేదా దుప్పటి కప్పుకొని నిద్రిస్తారు. అయితే ఇలాంటి సమయంలో ఎక్కువగా ఉష్ణోగ్రత ఏర్పడడం వల్ల కొందరికి ఉక్క పోత ఏర్పడుతుంది. దీంతో విపరీతమైన చెమటలు వస్తాయి. అయితే స్వెటర్ వేసుకోకపోయినా.. దుప్పటి కప్పుకోకపోయినా కొంతమందికి విపరీతమైన చెమటలు వస్తుంటాయి. ఈ చెమటలు రావడానికి ఆరోగ్య సమస్యలే కారణమని వైద్యులు అంటున్నారు. చలికాలంలోనూ విపరీతమైన చెమటలు వస్తున్నాయంటే శరీరంలో ఏవో సమస్యలు ఉన్నట్లు గుర్తించాలని వైద్యులు అంటున్నారు. మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. ఈ సమస్య తీవ్రమైనప్పుడు కూడా చలికాలంలో కూడా రాత్రి సమయంలో చెమటలు వస్తుంటాయి. అలాగే డయాబెటిస్ ప్రారంభమయ్యే ముందు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అతిగా మూత్రం రావడం.. పదేపదే కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం వంటివి జరుగుతుంది. రాత్రి సమయంలో మసాలా సంబంధించిన ఆహారం ఎక్కువగా తినడం వల్ల కూడా చెమటలు వస్తుంటాయి. కొందరు దీర్ఘకాలిక వ్యాధుల కోసం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్స్ పడక పోయినప్పుడు కూడా తీవ్రమైన చెమటలు వస్తుంటాయి. ఉద్యోగ, కార్యాలయాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో కూడా రాత్రి చెమటలు వస్తుంటాయి.
అయితే ఈ సమయంలో వైద్యులను సంప్రదించవచ్చా? లేదా? అని కొందరికి సందేహం ఉంటుంది. ప్రతిరోజు ఇలా చెమటలు వస్తూ బరువు తగ్గడం.. జ్వరం రావడం.. అలసట ఏర్పడడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కొందరికి దుప్పటి కప్పుకున్న తర్వాత కూడా చెమటలు వచ్చే అవకాశం ఉంది. ఒకరోజు చెమటలు తీవ్రంగా వచ్చి మరొక రోజు సాధారణ దుప్పటి కప్పుకున్న కూడా చెమటలు వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించడమే మంచిది. అయితే ఈ సమస్యను రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గదిలో పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. చలికాలంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రాసెస్ ఫుడ్ జోలికి పోకూడదు. మసాలా ఫుడ్ ను బాగా తగ్గించాలి.