https://oktelugu.com/

Street Food: భయపెట్టిస్తున్న స్ట్రీట్ ఫుడ్.. మీరూ తింటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచిస్తే మంచిది..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోడ్డు సైడ్ ఫుడ్ కు చెక్ పెడితేనే మంచిది. రుచిగా ఉంటుందని ఇష్టంగా లాగించేస్తే తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంది. మన తిన్న ఫుడ్ బిల్లు అటుంచితే.. ఇక దవాఖానల్లో బిల్లులు తడిసి మోపెడవడం ఖాయం.

Written By:
  • Mahi
  • , Updated On : November 6, 2024 / 11:09 AM IST

    Street Food

    Follow us on

    Street Food: బిజీలైఫ్ కారణంగా చాలా మంది స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. రుచిగా ఉందంటూ కడుపు నిండా లాగించేస్తున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు స్ర్టీట్ ఫుడ్ అంటేనే భయపెట్టిస్తున్నాయి. రుచిగా ఉందని ఏది పడితే అది తింటే హాస్పిటల్ బిల్లులు మన జేబులకు చిల్లులు వేయడం ఖాయం. వీధుల్లో అమ్మే ఆహారంలో నాణ్యత లేకున్నా ఒక్కోసారి తినకతప్పని పరిస్థితి ఉంటుంది. ఇదే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తాజాగా నిర్మల్ లో ఓ యువతి బిర్యానీ తిని అస్వస్థతకు గురై మృతి చెందింది. హైదరాబాద్ లో ఇటీవల ఓ వివాహిత మెమోస్ తిని మృతి చెందింది. పదుల సంఖ్యలో దవాఖానల పాలయ్యారు. ఇక షవర్మా తిని మరికొందరు ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు దవాఖానల్లో చేరారు. ఇలాంటి వార్తలు ఇటీవల నిత్యకృత్యమయ్యాయి. కల్తీ ఆయిల్, నాణ్యత, శుభ్రత లోపించడం కారణంగానే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వంట చేసుకోలేక కొందరు.. వారానికి ఒక్కసారైన హోటల్ లో తిందామని కొందరు, బద్దకంతో మరికొందరు రోడ్డు సైడ్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వ్యాపార కోణం మినహా ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి వ్యాపారం చేసే వారు అతి తక్కువ. ఇక అవేం పట్టించుకోకుండా విషాహారాన్ని తింటున్నామని మరిచి చాలా మంది లేని ఇబ్బందులు ‘కొని’ తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఫుడ్ ఒక వ్యాపారంగా మారింది. నాణ్యతకు తిలోదకాలు ఇస్తే కల్తీ ఆహారపదార్థాలను విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు ఎక్కువయ్యారు. మరి ఇలాంటి వారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

    అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోడ్డు సైడ్ ఫుడ్ కు చెక్ పెడితేనే మంచిది. రుచిగా ఉంటుందని ఇష్టంగా లాగించేస్తే తర్వాత పరిస్థితి చేయి దాటిపోతుంది. మన తిన్న ఫుడ్ బిల్లు అటుంచితే.. ఇక దవాఖానల్లో బిల్లులు తడిసి మోపెడవడం ఖాయం. మార్కెట్లో ప్రస్తుతం కల్తీ ఆయిల్ వాడకం ఎక్కువైంది. జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన ఆయిల్ ప్రస్తుతం మార్కెట్లో విరివిగా వాడబడుతున్నది. వీలైనంత వరకు ఇంటి భోజనమే మంచిది. తప్పనిపరిస్థతి అయితే మినహా బయట ఫుడ్ తినకపోవడమే ఉత్తమం.

    ఇక తాజాగా తెలంగాణలో మయోనైస్ వాడకాన్నినిషేధించారు. ఇప్పటివరకు ఈ గుడ్డుతో చేసిన మయోనైస్ ను విరివిగా వాడేవారు. యూత్ తో పాటు చిన్నపిల్లలు దీనికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. ఈ మయోనైస్ కారణంగా ఇటీవల ఫుడ్ పాయిజన్ రేట్లు పెరుగుతున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధించింది. షెవర్మా, మెమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ లలో దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు. మయోనైస్ కారణంగా అధిక బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. అయితే ఈ మయోనైస్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

    చాలా వరకు హోటళ్లో శుభ్రత అనేది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలం చెల్లిన సరుకులు వాడుతూ ఉంటారు. రిఫ్రిజిరేటర్లలో శుభ్రపరిచిన ఆహారపదార్థాలను కూడా వారు విక్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో అధికారులు అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. చిన్న హోటళ్ల నుంచి పెద్ద హోపటళ్ల వరకు ఈ తనిఖీల్లో నాణ్యత లోపించిన ఆహారం పెడుతున్నట్లుగా తేలింది. అయినా అధికారులు నామమాత్రపు జరిమానాలు, కొన్ని రోజులు సీజ్ లతో సరిపెడుతున్నారు. దీనిపై చాలా రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
    చాలా హోటళ్లు తనిఖీల్లో పట్టుబడినా వారం రోజుల్లో మరోసారి తెరుచుకోవడం అదే రీతిలో వండివార్చడం జరుగుతున్నది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు సీరియస్ గా రియాక్ట్ అవడం మినహా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరి దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కఠినమైన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్య సంబంధ విషయం కాబట్టి తప్పకుండా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. తూతూ మంత్రంగా తనిఖీలతో సరిపెట్టకుండా ఎప్పటికప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే మేలు చేసినట్లు అవుతుంది.