KCR Politics: రాష్ర్టంలో రాజకీయంగా గతంలో కంటే భిన్న పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చి పదినెలలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొంత లాభమే అయినా ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కు ప్రత్యేక స్థానం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తెలంగాణ రాష్టం్త ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్నారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలతో పాటు వ్యవహారశైలిపై వచ్చిన వ్యతిరేకతే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమవడంలో ఒక కారణమనే టాక్ కూడా జోరుగా వినిపించింది. ఒంటెద్దు పోకడలతో పాటు క్యాడర్ ను కలువకపోవడం, సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమవడం లాంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన భారీ మూల్యాన్నే చెల్లంచుకోవాల్సి వచ్చింది. బెట్టువీడని మనస్తత్వం కూడా మరో కారణంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. పార్టీలో కేటీఆర్, హరీశ్ రావు, కవితతో పాటు కీలక నేతలున్నా ఈ సారి అధికారానికి దూరమవడం వెనుక కొన్ని తప్పిదాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మరోవిషయం ఏంటటే ఇప్పుడు కూడా ఆయన అదే ఫామ్ హౌస్ నుంచి తన రాజకీయాలను కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన బయటకు వచ్చింది లేదు. ప్రజలను కలుసుకున్నది లేదు. వర్షాలు, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. మరి కేసీఆర్ మౌనముని ఎందుకయ్యారు. అసలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మనసు నొచ్చుకుందని పలువురు పార్టీ నాయకులు చెబుతుంటారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాత్రమే ఆయన బయట కనిపించారు. కవిత జైలులో ఉన్న సందర్భం, విడుదలైన సందర్భంలోనూ ఆయన బయటకు రాలేదు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
ఇప్పటికే పార్టీ క్యాడర్ లో కొంత నిస్తేజం కనిపిస్తున్నది. కేటీఆర్, హరీశ్ రావు ఇటీవల పిలిచిన కొన్ని ఆందోళన కార్యక్రమాలకు పార్టీ క్యాడర్ నుంచి వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. ఫామ్ హౌస్ నుంచే అడపాదడపా కొన్ని ఫోటోలను మీడియాకు వదులుతున్నారు. ఇంతకుమించి కొన్ని నెలలుగా ఆయన ప్రజాక్షేత్రంలో ఎక్కడా కనిపించలేదు. హైదరాబాద్ కు కూడా రాలేదు. ఆయన మౌనం తుఫాను ముందు ప్రశాంతత లాంటిదని బీఆర్ఎస్ లో కొందరు నేతలు చెబుతున్నా,
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన రాక కోసం హార్డ్ కోర్ అభిమానులతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కారణంగా బాధితులుగా మారిన ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు
ఆయన అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కుటుంబసభ్యులు ఈ విషయాన్ని దాస్తున్నారని ప్రతిపక్షనేతలు ఆరోపణలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారని, ఏడాది తర్వాత నేరుగా ప్రజల్లోకి వస్తారని చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ర్టంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన బయటకు రావాలని కొందరు కోరుతున్నారు.
అయినా కేసీఆర్ స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన క్యాడర్ ను కలువకపోవడమేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉండగా కూడా ఇలాగే ప్రవర్తించి ఈ పరిస్థితి తెచ్చుకున్నారని ఇప్పుడూ అదే రీతిలో ప్రవర్తిస్తున్నారని కొందరు లోలోపల మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో వ్యతిరేక భావన పెరుగుతున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చకోవడం, స్తంభించిన పాలన కూడా ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.
ప్రభుత్వాధినేతకు అధికారులపై పట్టు రాకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తున్నది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ప్రజల మధ్య ఉంటే పార్టీకి లాభం చేకూరుతుందని క్యాడర్ భావిస్తున్నది. పార్టీ ఓటమి తర్వాత ప్రజలే తప్పుచేశారన్నట్లుగా కేసీఆర్ తో పాటు కొందరు కీలక నేతల ప్రవర్తన ఉన్నట్లుగా బయట చర్చ జోరుగా సాగుతున్నది. అందుకే ఆయన ప్రజలకు దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే రాజకీయాల్లో ఇది తప్పుడు నిర్ణయమవుతుంది. మరోసారి తన వ్యవహారశైలిని బయట పెట్టుకున్నట్లవుతుంది.
ఏపీలో చూసుకుంటే ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రజల్లోనే గడిపారు. పార్టీ తరపున ఆయన క్యాడర్ ను కాపాడుకుంటూ ముందుకెళ్లారు. తాను అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కదిలించారు. ఇప్పుడు ఆయన అధికారపీఠం మరోసారి ఎక్కారు. ఓటమి నుంచి ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మరి తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి వేరుగా ఉంది.
రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఇలా ఎందుకు చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన మౌనం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకున్నా, ప్రస్తుతం రాష్ర్టంలో పరిస్థితులతో ప్రజలు కొంత ఇబ్బందికరంగా ఫీలవుతున్నారనేది నిజం.
మరి కీలక నేతగాఉన్న కేసీఆర్ బయటకు వచ్చి ప్రభుత్వంపై కదనభేరి మోగించాల్సిన అవసరం ఉంది. అయినా ఆయన ఎక్కడా పర్యటించిన దాఖలాలు లేవు. మరి ఈ మౌనంఇంకెన్నాళ్లో వేచి చూడాలి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు నిజమైతే అవి ప్రజలకు కుటుంబసభ్యులే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణలో .కేసీఆర్ లేని స్పేస్ స్పష్టంగా కనిపిస్తున్నదనే భావన వినిపిస్తున్నది.